Editorial: జూబ్లీహిల్స్‌లో అజారుద్దీన్ నజర్
ప్రజలు కొత్త ముఖాన్ని కోరుకుంటున్నారన్న అజారుద్దీన్ ; వివాదస్పదంగా మారిన మాజీ క్రికెటర్ వ్యాఖ్యలు;
తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం దగ్గరపడుతుండటంతో పొలిటికల్ హీట్ రోజు రోజు పెరుగుతోంది. టికెట్ దక్కించుకునేందుకు ఆశావాహులు పార్టీ పెద్దలను ప్రసన్నం చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. మరోవైపు నియోజకవర్గంల్లో పర్యటిస్తూ యాక్టివ్‌గా మారుతున్నారు. నిత్యం సేవా కార్యక్రమాల పేరుతో ప్రజలతో మమేకమవుతున్నారు. క్రమంలో అధికార, విపక్ష పార్టీల నేతలు వ్యక్తిగత ప్రచారం చేస్తూ ఆయా నియోజకవర్గాల్లో ముమ్మరంగా పర్యటిస్తున్నారు. ఈ నేపథ్యంలో గత కొన్నాళ్లుగా ఐక్యతా రాగం ఆలపిస్తున్న టీకాంగ్రెస్‌లో ఒక్కసారిగా విభేదాలు రచ్చకెక్కినట్లు ప్రచారం జరుగుతోంది.
హైదరాబాద్‌లోని జూబ్లీహిల్స్ నియోజకవర్గ కాంగ్రెస్‌లో వర్గపోరు రచ్చ కెక్కింది. వచ్చే ఎన్నికల్లో జూబ్లీహిల్స్ నుండి బరిలో దిగేందుకు కాంగ్రెస్ పార్టీ నేత, మాజీ క్రికెటర్ అజారుద్దీన్ సన్నాహాలు చేస్తున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో అత్యధికంగా ముస్లిం ఓట్లు ఉండటంతో అక్కడనుండి పోటీ చేసేందుకు అజారుద్దీన్ ఆసక్తి చూపిస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. ఈ క్రమంలో అనుచరులతో కలిసి జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పర్యటన చేయడంతో రాజకీయంగా కాంగ్రెస్‌లో కాక రేపింది. నియోజక వర్గంలో పర్యటించడమే కాకుండా ప్రజలు కొత్త ముఖాన్ని కోరుకుంటున్నారంటూ.. అజారుద్దీన్ చేసిన వ్యాఖ్యలు వివాదస్పదంగా మారినట్లు క్యాడర్‌లో చర్చ జరుగుతోంది.
మాజీ ఎమ్మెల్యే విష్ణువర్ధన్‌రెడ్డికి సమాచారం ఇవ్వకుండా నియోజకవర్గంలో అజారుద్దీన్ పర్యటించడంతో ఆగ్రహించిన ఆయన వర్గీయులు అడ్డుకున్నారు. రహమత్ నగర్ డివిజన్ ఎస్పీఆర్హిల్స్లో విష్ణువర్ధన్‌రెడ్డికి అనుకూలంగా నినాదాలు చేశారు. దీంతో ఇరువురి అనుచరుల మధ్య తోపులాట జరిగింది. పోలీసుల జోక్యంతో వివాదం తాత్కాలికంగా సద్దుమణిగినట్లు తెలుస్తోంది. అయితే అజారుద్దీన్ జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోని కార్యకర్తలతో చాయ్ పే చర్చ నిర్వహించాలనుకుని రహమత్ నగర్ డివిజన్ శ్రీరామ్ నగర్ చౌరస్తాలో సమావేశం ఏర్పాటు చేసేందుకు ర్యాలీగా వచ్చారు. దీంతో విష్ణువర్ధన్ రెడ్డి వర్గీయులు అడ్డుకోవడంతో పోలీసులు వారిని చెదరగొట్టారు. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో విష్ణువర్థన్ రెడ్డి వర్సెస్ అజారుద్దీన్‌గా రాజకీయం మలుపు తిరిగింది. అజారుద్దీన్ తీరుపై విష్ణువర్థన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. జూబ్లీహిల్స్‌తో తనకు 16 ఏళ్ల అనుబంధం ఉందన్న పీజేఆర్ కుమారుడు విష్ణువర్ధన్ రెడ్డి ముందుగా సమాచారం ఇస్తే తామే స్వాగతం పలికేవారమని అన్నారు.
గత కొంత కాలంగా విష్ణు వర్గన్ రెడ్డి పార్టీ హైకమాండ్‌పై అసంతృప్తితో ఉన్నట్లుగా గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో నియోజకవర్గంలో అజారుద్దీన్ పర్యటన అగ్గి రాజేసినట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అజారుద్దీన్ పర్యటన విషయాన్ని అధిష్ఠానం దృష్టికి తీసుకెళతానని విష్ణు తెలిపారు. తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో అధిష్టానం ఎవరివైపు మొగ్గు చూపుతుందో వేచి చూడాలి.