ఢిల్లీలో 2వ రోజు ఏపీ విద్యార్థుల Science & Technology ఎడ్యుకేషన్ టూర్
ఢిల్లీలో రెండో రోజు ఏపీ ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల సైన్స్ అండ్ టెక్నాలజీ ఎడ్యుకేషన్ టూర్
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాల విద్యార్థుల సైన్స్ అండ్ టెక్నాలజీ ఎడ్యుకేషన్ టూర్ ఢిల్లీలో రెండో రోజు ఉత్సాహంగా కొనసాగుతోంది. ఏపీ సైన్స్ సిటీ సీఈవో కేశినేని వెంకటేశ్వర్లు నేతృత్వంలో ఈ టూర్ విజయవంతంగా సాగుతోంది.
శుక్రవారం నాడు విద్యార్థుల బృందం న్యూఢిల్లీలోని రష్యా సోషల్ సైన్స్ అండ్ కల్చరల్ సెంటర్ ను సందర్శించింది. విద్యార్థుల ప్రతిభ, ఆసక్తి చూసి అక్కడి సెంటర్ అధికారులు ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రష్యా సోషల్, సైన్స్ కల్చరల్ సెంటర్ ఛీఫ్ ఈవెంట్ కోఆర్డినేటర్ ఓల్గా క్రోషినా మాట్లాడుతూ – “ఏపీ ప్రభుత్వం పాఠశాల స్థాయిలోనే ఇలాంటి సైన్స్ ఎడ్యుకేషన్ టూర్లు ఏర్పాటు చేయడం అభినందనీయం. విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం పెంపొందించడానికి ఇది మంచి వేదిక” అని అన్నారు.
రష్యా సోషల్ సైన్స్ అండ్ కల్చరల్ సెంటర్‌లో జ్యూరీ సభ్యుడు, నేషనల్ అవియేషన్ ఓలింపియాడ్ కోఆర్డినేటర్ వైభవ్ వరుణ్ విద్యార్థులతో ముచ్చటించారు. శాస్త్రం, సాంకేతికత రంగాల్లో ఉన్న విస్తృత అవకాశాలపై ఆయన ప్రేరణాత్మకంగా వివరించారు.
టూర్‌లో భాగంగా విద్యార్థులు గురువారం కేంద్ర పౌర విమానాయన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడును ప్రత్యేకంగా కలుసుకున్నారు. ఆ సందర్భంగా మంత్రి వారిని ఉత్సాహపరుస్తూ, “సైన్స్ రంగంలో మీ ఆసక్తిని కొనసాగించండి, ఆత్మవిశ్వాసంతో ముందుకు సాగండి” అని సూచించారు.
టూర్ తొలి రోజు విద్యార్థులు రాకెట్ టెక్నాలజీ, హైడ్రో రాకెట్, కెమికల్ రాకెట్ లాంచింగ్ పై నిర్వహించిన ప్రత్యేక వర్క్‌షాప్‌లో పాల్గొన్నారు. నిపుణులు రాకెట్ల రూపకల్పన నుంచి నిర్మాణం వరకు అవసరమైన శాస్త్రీయ పద్ధతులను చూపిస్తూ విద్యార్థులకు ప్రాయోగిక అవగాహన కల్పించారు.
ఏపీ సైన్స్ సిటీ మరియు సమగ్ర శిక్ష అభియాన్ సంయుక్త ఆధ్వర్యంలో ఈ టూర్ నిర్వహిస్తున్నారు. ప్రతి జిల్లాలోంచి ఇద్దరు విద్యార్థులను ఎంపిక చేసి మొత్తం 52 మంది ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఇందులో పాల్గొంటున్నారు. విద్యార్థి దశలోనే శాస్త్రం, సాంకేతికతపై ఆసక్తిని పెంపొందించేందుకు ఏపీ ప్రభుత్వం చేస్తున్న ఈ కృషి విద్యా రంగంలో నూతన దిశగా భావిస్తున్నారు