Editorial: సంగారెడ్డి బీఆర్ఎస్‌లో పొలిటికల్ హీట్
సంగారెడ్డిపై బిఆర్ఎస్ స్పెషల్ పోకస్ పెట్టిందా..? గత ఎన్నికల్లో స్వల్ప తేడాతో కోల్పోయిన ఆ సీటును తిరిగి దక్కించుకునేందుకు స్కెచ్ వేస్తోందా? దీని కోసం వ్యూహాలు సిద్ధం చేస్తుందా..? బీఆర్ఎస్ తరపున బరిలో నిలిచేదెవరు? సంగారెడ్డిలో పార్టీ గెలుపు కోసం గులాబీ బాస్ వ్యూహాలేంటి?;
ఉమ్మడి మెదక్ జిల్లాలో సంగారెడ్డి హాట్ సీటుగా మారింది. ఇక్కడ విజయం సాధించేందుకు అధికార ప్రతిపక్షాలు ఎత్తుకు పై ఎత్తులు వేస్తున్నాయి. మరో నాలుగైదు నెలల్లో ఎన్నికలు జరగనుండగా సంగారెడ్డి రాజకీయాల్లో ఇప్పటి నుండే కాక మొదలయింది. ఈ పరిణామాల నేపథ్యంలో సంగారెడ్డిపై స్పెషల్ ఫోకస్ పెట్టింది బిఆర్ఎస్ అధిష్టానం. ఏలాగైనా ఈసారి ఆ స్థానాన్ని తన ఖాతాలో వేసుకోవాలని వ్యూహరచన చేస్తోంది. గత ఎన్నికల్లో.. స్వల్ప తేడాతో బిఆర్ఎస్ సంగారెడ్డిని చేజార్చుకుంది. ఈ సారి ఎలాంటి తప్పిదాలు జరగకుండా పకడ్బందీ ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. గత ఎన్నికల్లో
కాంగ్రెస్ నుండి జగ్గారెడ్డి విజయం సాధించగా... బీఆర్ఎస్ అభ్యర్థి చింతా ప్రభాకర్ ఓటమి పాలయ్యారు. అయినా.. అన్నీ తానై నియోజకవర్గ పనులు చక్కబెడుతున్నారు చింతా ప్రభాకర్. ప్రోటోకాల్ ఇబ్బంది రావడంతో చేనేత డెవలప్ మెంట్ కార్పొరేషన్ ఛైర్మన్ పదవినీ కట్టబెట్టారు గులాబీ బాస్. బిఆర్ఎస్ జిల్లా అధ్యక్షునిగా ఉన్న ప్రభాకర్ రాబోయే ఎన్నికల్లో విజయం సాధించేందుకు ఎత్తులు వేస్తున్నారు.
అయితే ఈ సారి కూడా బీఆర్ఎస్ టిక్కెట్ చింతా ప్రభాకర్‌కే దక్కుతుందని నియోజకవర్గంలో ప్రచారం జరుగుతోంది. అయితే పోటీలో ఉన్నవారి సంఖ్య తక్కువేమీ లేదు. ఎమ్‌ఎల్‌సి వెంకట్రామిరెడ్డి సంగారెడ్డి బరిలో దిగే అవకాశమున్నట్లు ప్రచారం జరుగుతోంది. స్థానికేతరుడన్న అంశం తెరపైకి రావడంలోఆయన పూర్తిగా సైలెంట్ అయినట్లు టాక్ వినిపిస్తోంది. ఎన్‌ఆర్‌ఐ ఆత్మకూరు నగేష్‌తో పాటు డిసిసిబి వైస్ ఛైర్మన్ పట్నం మాణిక్యం, సదాశివపేట కౌన్సిలర్ పులిమామిడి రాజులు కూడా సంగారెడ్డి బరిలో దిగేందుకు తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. చింతా ప్రభాకర్ ఆరోగ్యం దెబ్బతినడంతో తమకు అవకాశం దక్కుతుందని ఆశావహులు ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నట్లు పార్టీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. చింతా ప్రభాకర్ కాదంటే తన పేరును పరిశీలించాలని ఆత్మకూరు నగేష్ అధిష్టానానికి సూచించారు. తాను ఎమ్మెల్యే రేసులో ఉన్నానంటూ ప్రెస్ మీట్ పెట్టి మరీ ప్రకటించారు పట్నం మాణిక్యం. కౌన్సిలర్ పులిమామిడి రాజు గతంలో హడావుడి చేసినా.. ఇప్పుడు మౌనంగా ఉన్నారు.
అయితే రాబోయే ఎన్నికల్లో జగ్గారెడ్డిని ఢీకొట్టేది ఎవరన్న దానిపై బీఆర్ఎస్ అధిష్టానం కసరత్తు ప్రారంభించింది. జగ్గారెడ్డిని ధీటుగా ఎదుర్కొనే నేతకోసం సర్వేలు చేయిస్తోంది. కొద్ది రోజుల క్రితం జగ్గారెడ్డే బిఆర్ఎస్‌లో చేరుతారన్న ప్రచారం జరిగింది. ఆయన చేరికను వ్యతిరేకిస్తూ బిఆర్ఎస్ శ్రేణులు సమావేశాలూ నిర్వహించారు.ఈ పరిణామాల నేపథ్యంలో జగ్గారెడ్డి కాంగ్రెస్‌లోనే కంటిన్యూ అవుతున్నారు. జగ్గారెడ్డిని ఢీకొట్టేందుకు పోటీ పడుతున్న నలుగురిలో బీఆర్ఎస్ అధిష్ఠానం ఎవరికి అవకాశం కల్పిస్తుందో చూడాలి.