తెలంగాణలో కొద్దిరోజులుగా జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటి వరకు బంగాళా ఖాతంలో ఏర్పడిన ద్రోణి, ఉపరితల ఆవర్తన ప్రభావంతో వర్షాలు కురవగా... తాజాగా అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో భారీ వర్షాలు కురవనున్నట్లు వాతావరణశాఖ హెచ్చరించింది. ఆరేబియా' సముద్ర పరివేష్ఠిత మద్య ప్రాచ్యంలో, దక్షిణ కొంకణ్ తీర ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడినట్టు పేర్కొంది. ఇది క్రమంగా ఉత్తరం వైపు కదులుతోందని, రానున్న 36 గంటల్లో బలపడి తీవ్ర వాయుగుండంగా మారనుందని ప్రకటించింది. దీని ప్రభావంతో కేరళ, కర్ణాటక, గోవాలో అతి భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది. అరేబియా సముద్రంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావంతో తెలంగాణలోనూ భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. అదేవిధంగా.. మే 27న ఉత్తర బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం కూడా ఉన్నట్టు తెలిపింది. రాబోయే రెండురోజుల్లో కేరళను నైరుతి రుతుపవనాలు తాకుతాయని.. ప్రస్తుతం కేరళ, తమిళనాడు, కర్నాటకలో నైరుతి రుతుపవనాలు ముం దుకు సాగేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని తెలిపింది. ఈనేపథ్యంలో తెలంగాణలో రానున్న అయిదు రోజులు భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఈ నెల 27వ తేదీ నాటికి పశ్చిమ మధ్య, ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది. ఆ తర్వాత రెండురోజుల్లో మరింత బలపడే అవకా శాలున్నాయని చెప్పింది.