Railway Minister : రైల్వే కోచ్లలో సీసీ కెమెరాలు... ప్రయాణికుల భద్రతే లక్ష్యమన్న మంత్రి
కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ మరో కీలక నిర్ణయం తీసుకుంది. రైల్వే కోచ్లలో తరచూ దొంగతనాలు జరగడం , పలువురు దుండగులు ప్రయాణికులపై దాడులు చేయడం వంటి ఘటనల నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల భద్రతే లక్ష్యంగా దేశవ్యాప్తంగా ఉన్న 74,000 రైలు కోచ్‌లలో త్వరలో సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నట్లు రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రకటించారు. కోచ్ డోర్ వద్ద ఈ కెమెరా లను అమర్చనున్నారు.
నార్తర్న్ రైల్వేలో సీసీటీవీ కెమెరాల ట్రయల్స్ ను విజయవంతంగా నిర్వహించారు అధికారులు.మంత్రి తో పాటు రైల్వే బోర్డు అధికారులు ఈ కెమెరా ల ఏర్పాటు, వాటి పురోగతి పైసమీక్షించారు. ప్రతి రైలు కోచ్‌కు డోమ్ తరహా నాలుగు సీసీటీవీ కెమెరాలు ఏర్పాటు చేయనున్నారు. ఒక్కో ప్రవేశ మార్గంలో రెండు కెమెరాలు ఉంటాయి. అదేవిధంగా, ప్రతి లోకోమోటివ్‌లో ఆరు సీసీటీవీ కెమెరాలు ఉంటాయి. వీటిలో ఒకటి ముందు వైపు, ఒకటి వెనుక వైపు మరియు రెండు వైపులా ఉంటాయి. లోకో యొక్క ప్రతి క్యాబ్‌లో (ముందు మరియు వెనుక) ఒక డోమ్ సీసీటీవీ కెమెరా మరియు రెండు డెస్క్-మౌంటెడ్ మైక్రోఫోన్‌లు అమర్చబడతాయి.
గంటకు 100 కిలోమీటర్ల కంటే ఎక్కువ వేగంతో ప్రయాణించే రైళ్లతో పాటు తక్కువ వెలుతురు ఉన్న పరిస్థితుల్లో కూడా అధిక-నాణ్యత గల దృశ్యాలు అందుబాటులో ఉండేలా చూడాలని మంత్రి వైష్ణవ్ రైల్వే అధికారులను కోరారు. ఇండియా ఏఐ మిషన్‌తో భాగస్వామ్యంతో దీన్ని మరింత ఆధునీకరించాలని అధికారులను సూచించారు.