సంక్రాంతి అంటేనే సంబరాలు మోసుకొచ్చే పండుగ. భోగి మంటలతో చలిని పారద్రోలే శుభసంతోషాలం సమయం ఇది. భోగి మంటలు కేవలం చలి నుంచి కాపాడటం మాత్రమే కాకుండా ఆరోగ్య ప్రయోజనాలను కూడా అందిస్తుంది. సంక్రాంతి పండక్కి సరిగ్గా నెల రోజుల ముందు ధనుర్మాసం ప్రారంభమవుతుంది. ఈ సమయంలో ఇంటి ముందు పెట్టిన గొబ్బెమ్మలను పిడకలుగా చేస్తారు. వాటినే భోగి మంటల్లో వేస్తారు. వీటిని కాల్చడం వల్ల గాలి శుద్ధి అవుతుంది. సూక్ష్మ క్రిములు నశిస్తాయి. ఈ పొగను పీల్చడం వలన శ్వాసకోశకు సంబంధించిన అనేక రోగాల నుంచి ఉపశమనం లభిస్తుంది. పిడకలతో పాటు రావి, మామిడి, మేడి, ఔషధ చెట్ల కలప, ఆవు నెయ్యి వేస్తారు. ఆవు నెయ్యి, ఆవు పిడకలను మంటల్లో వేయడం వల్ల శక్తివంతమైన గాలి విడుదలవుతుంది. ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది.
సిరిసంపదలను పెంచుకోవడం కాదు నలుగురితో కలిసి పంచుకోడానికి అనే సందేశం భోగి మనందరికీ ఇస్తుంది. అందుకే ఈ నాటికీ పల్లెల్లో ఈ పండుగ సందర్భంగా ఒకరింట్లో పండిన పంటలను, వండిన పిండి వంటలను ఒకరికొకరు ఇచ్చి పుచ్చుకుంటారు. పంచుకోవడంలో ఉన్న ఆనందాన్ని తెలియజేసేదే భోగి పండుగ.