ఢిల్లీ మాజీ మంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) సీనియర్ నాయకుడు సౌరభ్ భరద్వాజ్ ఇంట్లో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు సోదాలు నిర్వహించారు. భరద్వాజ్ ఢిల్లీ ప్రభుత్వంలో ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నప్పుడు హాస్పిటల్ నిర్మాణ ప్రాజెక్టులలో భారీ అవకతవకలు, జాప్యాలు మరియు అధిక వ్యయాలకు పాల్పడ్డారని ఆరోపణలు ఉన్నాయి. ఈ కుంభకోణానికి సంబంధించి మనీ లాండరింగ్ ఆరోపణలు కూడా ఉన్నట్లు ఈడీ అధికారులు పేర్కొన్నారు. దీనిలో భాగంగా భరద్వాజ్ నివాసంతో సహా ఢిల్లీ మరియు చుట్టుపక్కల ప్రాంతాలలో మొత్తం 13 చోట్ల ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. గతంలో ఢిల్లీ ప్రభుత్వం 24 కొత్త ఆసుపత్రుల నిర్మాణానికి సుమారు ₹5,590 కోట్లకు పైగా నిధులు కేటాయించింది. ఆరు నెలల్లో పూర్తి చేయాల్సిన ఈ ప్రాజెక్టులు మూడు సంవత్సరాలు గడిచినా ఇంకా అసంపూర్తిగా ఉన్నాయని ఆరోపణలు వెలువడ్డాయి.ఈ ప్రాజెక్టులలో రూ.800 కోట్లు ఖర్చు చేసినా కేవలం 50 శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయని, కొన్ని చోట్ల అనుమతులు లేకుండానే నిర్మాణాలు ప్రారంభించారని ఆరోపణలు ఉన్నాయి. ఈ దాడులను ఆమ్ ఆద్మీ పార్టీ తీవ్రంగా ఖండించింది. ఈ చర్య రాజకీయ ప్రేరేపితమని, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం రాజకీయంగా తమను ఎదుర్కోలేక ఈడీని దుర్వినియోగం చేస్తోందని ఆరోపించింది. ప్రాజెక్టుల ఆలస్యానికి పరిపాలనాపరమైన సమస్యలు మరియు విధానపరమైన ఇబ్బందులు కారణమని, ఇది కుంభకోణం కాదని పేర్కొంది.