రాజస్థాన్‌లోని బికనీర్‌లో జరిగిన ప్రమాదంలో ఇద్దరు జవాన్లు మరణించారు. ట్రైనింగ్‌లో భాగంగా ఓ ట్రక్కులో మందుగుండు సామగ్రి లోడ్ చేస్తుండగా పేలుడు సంభవించినట్లు అధికారులు వెల్లడించారు. ఇద్దరు జవాన్లు మృతి చెందగా, మరొకరికి గాయాలు అయ్యాయని తెలిపారు. మహాజన్ ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్‌లో ఈ ప్రమాదం జరిగింది. మందుగుండు సామాగ్రిని లోడ్ చేస్తుండగా ఛార్జర్ పేలడంతో ప్రమాదం జరిగినట్లు రక్షణ శాఖ అధికార ప్రతినిధి లెఫ్టినెంట్ కల్నల్ అమితాబ్ శర్మ వెల్లడించారు. గాయపడిన సైనికుడిని హెలికాప్టర్‌లో చండీగఢ్‌కు తరలించామన్నారు. మృతుల్లో ఒకరైన అశుతోష్ మిశ్రా ఉత్తరప్రదేశ్‌లోని డియోరియా ప్రాంతానికి చెందినవారు కాగా, జితేంద్ర స్వస్థలం రాజస్థాన్‌లోని దౌసా . వారి మృతదేహాలను సూరత్‌గఢ్ మిలటరీ స్టేషన్‌కు తరలించారు. ఇది ఈ వారంలో రేంజ్‌లో జరిగిన రెండో ప్రమాదమని సైనికాధికారులు పేర్కొన్నారు. ఆదివారం చంద్రప్రకాష్ పటేల్ అనే గన్నర్ తుపాకీని టోయింగ్ వాహనానికి అమరుస్తుండగా వాహనం ఒక్కసారిగా వెనకకు జారడంతో తీవ్ర గాయాలపాలై మరణించినట్లు తెలిపారు.