ప్రముఖ మోడల్ సాన్ రేచల్ గాంధీ ఆత్మహత్య చేసుకుంది. పుదుచ్చేరి కారామణికుప్పంలోని ఆమె నివాసంలోనే ఆత్మహత్యకు పాల్పడ్డారు. భారతీయ సినిమా, ఫ్యాషన్ పరిశ్రమలో వర్ణవివక్షకు వ్యతిరేకంగా ఆమె తన గళాన్ని వినిపించారు. 2022లో మిస్ పుదుచ్చేరి టైటిల్‌ను గెలుచుకున్నారు. అదేవిధంగా మిస్ బెస్ట్ యాటిట్యూడ్ 2019, మిస్ డార్క్ క్వీన్ తమిళనాడు 2019, క్వీన్ ఆఫ్ మద్రాస్ 2022 వంటి బహుమతులను అందుకున్నారు. ఆర్థిక సమస్యలే ఆమె మరణానికి కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. ఆమెకు ఏడాది క్రితమే వివాహం అయ్యింది.
భారీ అప్పుల వల్ల సాన్ రేచల్ మానసిక ఒత్తిడిలో ఉన్నట్టు పోలీసులు అనుమానిస్తున్నారు. ఫ్యాషన్ షోలు నిర్వహించడంలో జరిగిన నష్టాలు ఈ ఆర్థిక సమస్యలకు దారితీసినట్టు తెలుస్తోంది. ఆమె ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నట్లు సమాచారం. ఇది ఆమె మానసిక ఒత్తిడిని మరింత పెంచి ఉండవచ్చని అనుమానిస్తున్నారు. ఘటనా స్థలంలో సూసైడ్ నోట్ లభించినట్టు తెలిసింది. రేచల్ గతేడాది వివాహం చేసుకున్న నేపథ్యంలో ఈ ఆత్మహత్యకు ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అని పరిశీలిస్తున్నారు.
సాన్ రేచల్ గాంధీ ఫ్యాషన్ ప్రపంచంలో ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. మహిళలు ఎదుర్కొనే వివక్షను ఎదిరించడంలో ఆమె సోషల్ మీడియాను వేదికగా చేసుకున్నారు. 2022లో మిస్ పుదుచ్చేరి టైటిల్ గెలుచుకోవడం ద్వారా ఆమె గుర్తింపు తెచ్చుకున్నారు. ఫ్యాషన్ షోలు, ఇతర ఈవెంట్‌లలో రేచల్ చురుకైన పాత్ర పోషించారు.