రాష్ట్రంలో మంగళవారం రాత్రి నుంచి కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పలు చోట్ల రైలు పట్టాలపైకి వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో రైల్వే ప్రయాణికుల భద్రత దృష్ట్యా రైళ్ల వేగాన్ని తగ్గించాలని రైల్వేశాఖ అత్యవసర హెచ్చరికలు జారీ చేసింది. పిడుగురాళ్ల-బెల్లంకొండ మధ్యలోని వంతెన నంబర్-59 వద్ద వరద నీరు ప్రమాద హెచ్చరిక మార్క్‌కు చేరుకుంది.గుంటూరు-తెనాలి మధ్య వంతెన నంబర్-14 వద్ద, అలాగే వెజెండ్ల-మణిపురం మధ్య వంతెన నంబర్-14 వద్ద కూడా ఇదే పరిస్థితి ఉంది.
ఈ పరిస్థితుల కారణంగా రైల్వే సిబ్బంది రైళ్లను కేవలం 30 కి.మీ./గం. వేగంతో మాత్రమే నడపాలని రైల్వేశాఖ ఆదేశించింది. అధికారులు పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తున్నారని, నీటి మట్టం తగ్గిన తర్వాత రైళ్ల సాధారణ వేగం పునరుద్ధరించబడుతుందని రైల్వే అధికారులు వెల్లడించారు.