అంతర్జాతీయ ద్రవ్య నిధి (IMF) మొదటి డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ గీతా గోపీనాథ్ ఆ సంస్థ నుంచి వైదొలగనున్నారు. ఈ విషయాన్ని IMF అధికారికంగా ప్రకటించింది. గీతా గోపీనాథ్ ఆగస్టు నెలాఖరులో ఐఎంఎఫ్ ను వీడతారు. ఆమె తిరిగి హార్వర్డ్ విశ్వవిద్యాలయానికి వెళ్ళి, ఎకనామిక్స్ ప్రొఫెసర్ గా బాధ్యతలు స్వీకరిస్తారు. ఆమె హార్వర్డ్ లో "గ్రెగొరీ అండ్ అనియా కాఫీ ప్రొఫెసర్ ఆఫ్ ఎకనామిక్స్"గా పనిచేయనున్నారు. గీతా గోపీనాథ్ జనవరి 2019లో IMFలో మొదటి చీఫ్ ఎకనామిస్ట్ గా చేరారు. జనవరి 2022లో ఆమెను మొదటి డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ గా పదోన్నతి కల్పించారు. IMF మేనేజింగ్ డైరెక్టర్ క్రిస్టాలినా జార్జివా, గీతా గోపీనాథ్ ను "అత్యుత్తమ సహోద్యోగి, అసాధారణ మేధో నాయకురాలు" అని ప్రశంసించారు. కోవిడ్-19 మహమ్మారి వంటి సవాళ్లతో కూడిన సమయంలో ఆమె ఐఎంఎఫ్ కు గణనీయమైన సహకారం అందించారని పేర్కొన్నారు. ఐఎంఎఫ్ లో తన సమయాన్ని "ఒక గొప్ప అవకాశం"గా పేర్కొన్న గీతా గోపీనాథ్, తాను తిరిగి విద్యా రంగంలోకి వెళ్లి అంతర్జాతీయ ఆర్థిక రంగంలో పరిశోధనలను కొనసాగించడంతో పాటు, తదుపరి తరం ఆర్థికవేత్తలకు శిక్షణ ఇవ్వాలని ఆశిస్తున్నట్లు తెలిపారు.