పహెల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత్ - పాక్ మధ్య ఉద్రిక్తతలు నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ తమ గగనతలంలోకి ఇండియా విమానాల రాకపోలను నిషేధించింది. వారం రోజులు ఓపిక పట్టిన భారత్ కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. ప్రతీకార చర్యలకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. పాక్ విమానయాన సంస్థలకు మన గగనతలాన్ని మూసివేసే అంశాన్ని పరిశీలిస్తున్నట్లు సమాచారం. దీనిపై భారత్ నిర్ణయం తీసుకుంటే.. అది పాక్ ఎయిర్లైన్లపై పెను ప్రభావం చూపించే అవకాశం ఉంది. పాక్ విమానాలు కౌలాలం పూర్ సహా మలేసియాలోని ఇతర నగరాలు, సింగపూర్, థాయ్లాండ్ వంటి ప్రాంతాలకు వెళ్లాలంటే మన గగనతలాన్ని దాటాల్సిందే. ఇప్పుడు భారత్ నిషేధం విధిస్తే.. దక్షిణాసియా ప్రాంతాలకు వెళ్లేందుకు చైనా లేదా శ్రీలంక మీదుగా విమానాలను మళ్లించాల్సి ఉంటుంది. అప్పుడు ప్రయాణసమయం పెరగడంతో పాటు నిర్వహణ పైనా అదనపు భారం పడుతుంది.