బంగాళాఖాతంలో అల్పపీడనం.. 4 రోజులు వర్షాలు బంగాళాఖాతంలో రేపు అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఏపీలో పలు చోట్ల నేటి నుంచి 4 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. మరోవైపు ద్రోణి ప్రభావంతో తెలంగాణలో కొన్ని చోట్ల నేటి నుంచి మూడు రోజుల పాటు మోస్తరు వర్షాలు కురుస్తాయని ఐఎండీ అంచనా వేసింది. అదే సమయంలో కొన్ని చోట్ల ఎండలు పెరిగే అవకాశం ఉందని హెచ్చరించింది. సోమవారం రాయలసీమలో 40 నుంచి 42 డిగ్రీలు, ఉత్తరాంధ్రలో 39 నుంచి 41 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశముందని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ కూర్మనాథ్ తెలిపారు. ఆదివారం కర్నూలు జిల్లా కామవరంలో 40.8, పెద్దడోర్నాల (ప్రకాశం జిల్లా)లో 40.7, దొర్నిపాడు (నంద్యాల)లో 40.6, రావిపాడు (పల్నాడు)లో 40.5, పొందూరు (శ్రీకాకుళం)లో 40.3 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని వివరించారు.