అమెరికా మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామాతో విడాకుల వార్తలను మిషెల్ ఒబామా ఖండించారు. ఓ పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న ఆమె ఈ ప్రచారం మహిళల స్వేచ్ఛపై దాడేనని మండిపడ్డారు. కొన్నాళ్లుగా ఒబామాతో కలిసి మిషెల్ ఈవెంట్లకు హాజరు కాకపోవడంతో విడాకుల ప్రచారం జోరందుకుంది. అయితే ఆ కార్యక్రమాలకు వెళ్లడమనేది తన వ్యక్తిగత విషయమే తప్ప వైవాహిక బంధంలో ఏర్పడిన వివాదాల వల్ల కాదన్నారు. ఇతరులనుకునేది చేయడం తన పని కాదని తేల్చి చెప్పారు.
‘గత ఎనిమిదేళ్లలో నా జీవితంలో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి. కుమార్తెలు పెద్దవాళ్లు అయ్యారు. నా గురించి ఆలోచించుకోవడానికి ఇప్పటికైనా నాకు సమయం దొరికింది. ఒక మహిళకు ఉండే స్వేచ్ఛ కోణంలో ఎవరూ ఆలోచించడం లేదు. ఆమె తన కోసం ఆలోచిస్తోందని, తగిన నిర్ణయాలు తీసుకుంటోందని ఎవరూ గ్రహించడంలేదు. కేవలం భర్త నుంచి విడిపోతోందనే చర్చించుకుంటున్నారు. నేను మాత్రం నాకు ఏది మంచో అదే చేయాలనుకుంటున్నా. అంతేకానీ ఇతరులు ఏమనుకుంటున్నారో అది నేను చేయను’ అని మిషెల్ చెప్పుకొచ్చారు.