ఒడిశా మాజీ ముఖ్యమంత్రి, బిజూ జనతాదళ్ (BJD) అధినేత నవీన్ పట్నాయక్ ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆయనను త్వరలో ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ చేయవచ్చని వైద్యులు తెలిపారు. వయో సంబంధిత అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఆదివారం (ఆగస్టు 17, 2025) భువనేశ్వర్‌లోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరారు. నవీన్ పట్నాయక్‌కు డీహైడ్రేషన్ (శరీరంలో నీటి శాతం తగ్గడం) సమస్య వల్ల అనారోగ్యానికి గురయ్యారని ఆసుపత్రి వర్గాలు వెల్లడించాయి. ప్రస్తుతం ఆయనకు వైద్యుల పర్యవేక్షణలో చికిత్స అందిస్తున్నారు. ఆయన ఆరోగ్యం చికిత్సకు బాగా స్పందిస్తోందని, నిలకడగా ఉందని వైద్యులు చెప్పారు. కొన్ని రోజుల క్రితమే నవీన్ పట్నాయక్ సర్వికల్ ఆర్థరైటిస్ కోసం ముంబైలో వెన్నెముక శస్త్రచికిత్స చేయించుకుని కోలుకుంటున్నారు. ఈ నేపథ్యంలో వయసు సంబంధిత సమస్యలు తలెత్తాయి.బీజేడీ పార్టీ ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత నవీన్ పట్నాయక్ రాజకీయ కార్యకలాపాలకు దూరంగా ఉన్నారు. ఈ తరుణంలో ఆయన ఆసుపత్రిలో చేరడం అభిమానులు, పార్టీ శ్రేణులలో ఆందోళన కలిగించింది. అయితే, ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, త్వరలో డిశ్చార్జ్ అవుతారని తెలియడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ కూడా నవీన్ పట్నాయక్‌ను పరామర్శించారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఈ మొత్తం వ్యవహారాన్ని బీజేడీ పార్టీ ఉపాధ్యక్షుడు దేబి ప్రసాద్ మిశ్రా సారథ్యంలోని 15 మంది సభ్యుల కమిటీ పర్యవేక్షిస్తోంది.