విశాఖ-సికింద్రాబాద్-విశాఖ మధ్య నడుస్తున్న వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌ను జనవరి 11 నుంచి 20 కోచ్‌లతో నడపనున్నట్లు అధికారులు తెలిపారు. ఇందులో 18 చెయిర్ కార్, 2 ఎగ్జిక్యూటివ్ చెయిర్ కార్ కోచ్‌లు ఉండనున్నాయి. ప్రస్తుతం వందేభారత్‌లో 16 కోచ్‌లు ఉన్నాయి. విశాఖపట్నంలో ప్రతీ రోజు ఉదయం 5.45 గంటలకు బయల్దేరే విశాఖపట్నం–సికింద్రాబాద్(20833) వందేభారత్ ఎక్స్‌ప్రెస్, తిరుగు ప్రయాణంలో సికింద్రాబాద్‌లో మధ్యాహ్నం 3 గంటలకు బయల్దేరే సికింద్రాబాద్– విశాఖపట్నం (20834) వందేభారత్ ఎక్స్‌ప్రెస్‌లు ఈ నెల 11వ తేదీ నుంచి 20 కోచ్‌లతో నడుస్తాయి. అప్పటినుంచి ఈ రైలు 18–చెయిర్‌కార్, 2–ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ కోచ్‌లతో నడుస్తుంది. ప్రస్తుతం ఈ వందేభారత్ 16 కోచ్‌లతో నడుస్తుంది.
ఇక, సికింద్రాబాద్ నుంచి ఢిల్లీకి వందేభారత్ స్లీపర్, విజయవాడ నుంచి అయోధ్య కు మరో రైలు పైనా ప్రతిపాదనలు పరిశీలనలో ఉన్నట్లు సమాచారం. వీటి పైన రెండో విడతలో రైల్వే శాఖ నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది. ఇక.. బెంగళూరు కు సైతం ఏపీ నుంచి వందేభారత్ నడపాలనే వినతులు వస్తున్నాయి. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి పెరుగుతున్న డిమాండ్ ను పరిగణలోకి తీసుకొని.. విడతల వారీగా కేటాయింపులు ఉంటాయని అధికారులు చెబుతున్నారు. తొలి విడత లోనే తెలుగు రాష్ట్రాలకు వందే భారత్ స్లీపర్ కేటాయింపు ఖాయంగా కనిపిస్తోంది.