Coronavirus Food Diet: ఒమిక్రాన్ సమయంలో వైరస్‌ల నుండి కాపాడగలిగే ఆహార పదార్థాలు ఇవే..
Coronavirus Food Diet: వైరస్‌లకు దూరంగా ఉండడం కోసం ఉపయోగపడే ఆహారా పదార్థాల్లో కచ్చితంగా అల్లం ఉండాల్సిందే..;
Coronavirus Food Diet: చాలావరకు ఆరోగ్య సమస్యలను ఎదుర్కోవడానికి ఆహారమే పరిష్కారం. సరైన ఫుడ్ డైట్ వల్ల చాలావరకు ఆరోగ్య సమస్యలు దూరమవుతున్నాయి. వైరస్ విస్తృతంగా వ్యాపిస్తున్న ఈ సమయంలో మంచి ఆహారం తీసుకోవడం ముఖ్యం. కొన్ని ఆహార పదార్థాల వల్ల వేగంగా వ్యాపించే వైరస్‌ల వల్ల బలహీన పడకుండా ఉండవచ్చు.
ప్రస్తుతం మళ్లీ కోవిడ్ విజృంభణ మొదలయ్యింది. అంతే కాకుండా కొత్తగా వచ్చిన ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి విషయంలో చాలా వేగంగా ఉంది. ఒక్కొక్కరోజు దేశవ్యాప్తంగా లక్షల సంఖ్యలో కేసులు నమెదవుతున్నాయి. అందుకే ఎవరికి వారు జాగ్రత్తగా ఉండడం ఎందుకైనా మంచిది. మాస్క్‌లు, శానిటైజర్‌లు వాడడంతో పాటు సోషల్ డిస్టెన్సింగ్ కూడా చాలా ముఖ్యం. వాటితో పాటు సరైన ఆహారం కూడా ముఖ్యమే.
వైరస్‌లకు దూరంగా ఉండడం కోసం ఉపయోగపడే ఆహారా పదార్థాల్లో కచ్చితంగా అల్లం ఉండాల్సిందే అంటున్నారు వైద్యులు. అల్లం అనేది ప్రతీ ఇంట్లో ఉండే పదార్థమే. కానీ ప్రతీ ఆహార పదార్థంలో ఒక మోతాదు అల్లం వేసుకోవడం వల్ల జెర్మ్స్, బ్యాక్టీరియా, వైరస్‌లతో పోరాడడంలో శరీరానికి బలన్ని చేకూరుస్తుంది. ఇక అల్లం టీ అలవాటు చేసుకోవడం వల్ల రోగనిరోధక వ్యవస్థ కూడా బలంగా మారుతుంది.
అల్లంతో పాటు పసుపు కూడా ప్రతీ ఇంట్లో ఉండే పదార్థమే. పసుపు అనేది చాలా శక్తి వంతమైన యాంటీ ఆక్సిడెంట్. దగ్గు లాంటి వాటికి దూరంగా ఉండడానికి ఇది ఉపయోగపడుతుంది. 1 టీస్పూన్ పసుపును తీసుకుని, ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో కలుపుకొని ప్రతిరోజూ ఉదయం ఖాళీ కడుపుతో తాగితే చాలా వరకు ఆరోగ్య సమస్యలు దూరమవుతాయి.
సంక్రాంతి సీజన్ అంటే ఉసిరికి ఫేమస్. సంవత్సరంలో ఎప్పుడూ దొరకనంతగా ఉసిరి.. ఈ సీజన్‌లోనే లభిస్తుంది. ఉసిరిలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది. రోగనిరోధక వ్యవస్థను బలంగా చేసేవాటిలో విటమిన్ సి కూడా ఒకటి. చాలావరకు ఇన్ఫెక్షన్లను దూరం చేయడంలో ఉసిరి ఉపయోగపడుతుంది. రోజూ ఉసిరికాయ రసం తాగడం ఆరోగ్యానికి మంచిది.
తేనె కూడా రోగ నిరోధక శక్తి పెంచడంలో సహాయపడుతుంది. జీర్ణక్రియకు తేనె ఉపయోగపడుతుందని వైద్యులు చెప్తుంటారు. అల్లం టీలో చక్కెరకు బదులుగా తేనె కలుపి తీసుకుంటే రోగనిరోధక శక్తిని మరింత బలంగా చేస్తుంది. తేలికగా జీర్ణమయ్యే కొవ్వులలో ఒకటైన నెయ్యి కూడా రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది. అందుకే రోజువారీ ఆహారంలో నెయ్యి కచ్చితంగా ఉండడం మంచిదంటున్నారు వైద్యులు.
అధిక ఫైబర్ ఉండే రాగులు కూడా ఆరోగ్యానికి మంచిది. ఇవి కూడా వైరస్‌ల నుండి మనల్ని కాపాడడానికి తోడ్పడతాయి. ముఖ్యంగా శీతాకాలంలో రాగి, బజ్రా, జొన్న వంటివి తినడం చాలా మంచిది. వీటిలో ఫైబర్ అధికంగా ఉంటుంది కాబట్టి ఇవి జీర్ణ వ్యవస్థకు మంచిది. ప్రస్తుతం ఉన్న వైరస్ కాలంలో ప్రతీ ఒక్కరం పోరాడుతున్నాం కాబట్టి అందుకు ఈ ఆహార పదార్థాలు ఎంతగానో తోడ్పడతాయి.