ఉదయాన్నే బ్రెడ్ తింటున్నారా.. ఇది తెలిస్తే..
టిఫిన్ ఏం లేదా.. పర్లేదు లే బ్రెడ్ తినేస్తాను.. అని అంటున్నారా.. ఆగండాగండి.. ఒక్క నిమిషం ఇది చదవండి..;
ఓ బ్రెడ్ ప్యాకెట్ తెచ్చి ఫ్రిజ్‌లో పడేస్తే స్కూల్‌కి వెళ్లేటప్పుడు టిఫిన్ వద్దంటూ మారాం చేసే పిల్లలకు రెండు బ్రెడ్ ముక్కలు పాలల్లో వేసి ఇచ్చేస్తుంది అమ్మ. లేదంటే బ్రెడ్ ఆమ్లెట్. ఇంట్లో పెద్ద వాళ్లు ఉంటే వాళ్లుకూడా తాగే టీలోనో, పాలల్లోనో వేసుకుని తింటూ ఉంటారు ఉదయాన్నే. కానీ ఉదయం పూట బ్రెడ్ తీసుకోవడం మంచిది కాదంటున్నారు పోషకాహార నిపుణులు.
దీనివల్ల గ్యాస్, అసిడిటీ వంటి సమస్యలతో పాటు, డిప్రెషన్ వంటి మానసిక సమస్యలు కూడా వస్తాయని చెబుతున్నారు. దీనికి కారణం.. బ్రెడ్‌లో గ్లూటెన్ అనే ఆమ్లం ఉంటుంది. ఇది మెదడుపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తుందని చెబుతున్నారు. కాబట్టి ఉదయం పూట బ్రెడ్ తీసుకుంటే మెదడు పని తీరు తగ్గుతుందని దాంతో ఒత్తిడి పెరుగుతుందని చెబుతున్నారు.
కొన్ని సందర్భాల్లో తప్పని సరి తీసుకోవల్సి వస్తుంది. అలాంటప్పుడు బ్రెడ్ తిన్న వెంటనే ఏదైనా పండు తీసుకుంటే సరిపోతుంది అని అంటున్నారు. కానీ రెగ్యులర్‌గా మాత్రం బ్రెడ్ తీసుకోకపోవడమే మంచిదని అంటున్నారు.
బ్రెడ్‌ని ఏ రూపంలో తీసుకున్నా శరీరానికి కావలసిన పోషణను అందించదు. గోధుమ బ్రెడ్ తీసుకుంటే ఎక్కువ మొత్తంలో కాకపోయినా కొన్ని పోషకాలను అందిస్తుంది. బ్రెడ్‌లో అధిక రక్తపోటుకు కారణమయ్యే సోడియం లెవల్స్ ఎక్కువ స్థాయిలో ఉంటాయి. దీంట్లో ఉప్పు ఎక్కువగా ఉండడం వలన బ్రెడ్‌ని వివిధ రూపాల్లో తీసుకుంటే గుండెకు సంబంధించిన వ్యాధుల బారిన పడే ప్రమాదం ఉంది. బ్రెడ్ సంబంధిత పదార్థాలైన కేకులు, బర్గర్లు వంటివి తీసుకుంటే కూడా చక్కెర స్థాయిలు అధికంగా ఉండి బరువు పెరగడానికి కారణమవుతాయని ఆరోగ్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.