లాక్డౌన్‌లో లావయ్యారా.. పెరుగుతున్న బరువుకి ప్రభుత్వం చెక్..
లాక్డౌన్‌లో లావైపోయిన వాళ్లు చాలా మంది.. పెరిగిన తమ సైజ్ చూసుకుని తగ్గేదెలా అని తపన పడుతున్నారు.;
లాక్డౌన్‌లో లావైపోయిన వాళ్లు చాలా మంది.. పెరిగిన తమ సైజ్ చూసుకుని తగ్గేదెలా అని తపన పడుతున్నారు. వర్క్ ఫ్రం హోమ్.. కంప్యూటర్ ముందే బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్. నాలుగడుగులు వేస్తే అన్నీ దొరుకుతున్నాయి. చాలా వరకు ఆన్‌లైన్‌లో షాపింగ్. కాలు తీసి బయటకు పెట్టాల్సిన అవసరం చాలా తక్కువ. దాంతో తిన్నది ఎలా కరుగుతుంది. పొట్ట పెరక్క ఏమవుతుంది. దీంతో ప్రభుత్వం దృష్టి ఇలా అడ్డంగా పెరిగిపోతున్న వారిపై పడింది. కంట్రోల్ చేయకపోతే చాలా కష్టం అని భావించి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ కచ్చితంగా పాటించమంటూ బ్రిటన్ పౌరులను ఆదేశించింది.
యూకేలో నిర్వహించిన సర్వేలో దాదాపు 41 శాతం మంది లావైనట్లు కనుగొన్నారు. సగటున ఒక్కొక్కరు 4 కిలోల బరువు పెరిగినట్లు అక్కడి నేషనల్ హెల్త్ సర్వీస్ (ఎన్‌హెచ్ఎస్) అంచనా వేసింది. ఇలా వదిలేస్తే ఇంకా బరువు పెరుగుతారు. దాంతో అనారోగ్య సమస్యలు తలెత్తుతాయని భావించిన ప్రభుత్వం అక్కడి పౌరులకు సన్నబడాలని సూచించింది.
ఈ మేరకు ప్రభుత్వం తరపున కొన్ని కార్యక్రమాలు నిర్వహించేందుకు ఎన్‌హెచ్ఎస్ సిద్ధమైంది. టీవీల్లో వచ్చే జంక్ ఫుడ్‌కు సంబంధించిన వాణిజ్య ప్రకటనలపై నియంత్రణ విధించింది. ఆహార పదార్థాల్లో ఉండే కెలరీల వివరాల్ని కస్టమర్లకు తెలిసేలా పోస్టర్లు పెట్టాలని హోటళ్లు, రెస్టారెంట్లు, ఫుడ్ కోర్టులకు ఆదేశాలు జారీ చేసింది. జంక్ ఫుడ్‌పై పన్నులు పెంచాలన్న ఆలోచన చేస్తుంది. బరువు తగ్గడానికి ఉపయోగపడే యాప్‌లు, ప్రణాళికలను ఎన్‌హచ్ఎస్ ప్రోత్సహిస్తుంది. అలాగే బరువు తగ్గించేందుకు ఎలాంటి ఆహార పదార్ధాలను తీసుకోవాలనే విషయాన్ని కూడా ప్రకటన రూపంలో ఇస్తోంది.
బ్రిటన్ పౌరులు ఎవరైతే ఆరోగ్యకరమైన అలవాట్లు అలవర్చుకుంటారో వారికి ప్రభుత్వం ప్రోత్సాహకాలు, బోనస్‌లు, డిస్కౌంట్ కూపన్లు ఇవ్వనున్నట్లు ప్రకటించింది. జంక్ ఫుడ్ మానేసి ఎక్కువ కూరగాయలు, పండ్లు తినేవారికి ఈ ప్రోత్సాహకాలు అందించనున్నారు. బ్రిటన్ ప్రధాని సైతం ఈ కార్యక్రమంలో భాగమై బరువు తగ్గుతానని ప్రతిజ్ఞ చేశారు.
ప్రభుత్వం రూపొందించే ప్రత్యేక యాప్ ద్వారా సూపర్ మార్కెట్లో పౌరులు ఏం కొంటున్నారు అనేదానిపై ఓ కన్నేసి ఉంచుతారు. ఎవరైతే కూరగాయలు, పండ్లు కొనుగోలు చేస్తారో వారికి లాయల్టీ పాయింట్లు ఇస్తారు. ఇక స్కూల్‌కి, కాలేజీలకు, ఆఫీసులకు వాహనాల్లో వెళ్లకుండా నడిచి వెళితే వారికి అదనపు పాయింట్లు లభిస్తాయి. అలా వచ్చిన పాయింట్లను నగదు రూపంలో మార్చుకోవచ్చు లేదా డిస్కౌంట్స్.. ఫ్రీ టికెట్స్ పొందొచ్చు. ఈ కార్యక్రమం వచ్చే ఏడాది జనవరి నుంచి అమలు కానుంది. ఇలాంటి కార్యక్రమమే దుబాయ్ కొన్నేళ్ల క్రిందటే ప్రారంభమైంది. అక్కడి పౌరులు అధిక బరువుని తగ్గించుకుంటే బంగారం ఫ్రీ. ఎన్ని కిలోల బరువు తగ్గితే అన్ని గ్రాముల బంగారం ఉచితంగా ఇస్తున్నారు.