మహారాష్ట్రను వణికించిన భారీ వర్షాలు..136కు చేరిన మృతుల సంఖ్య..!
భారీ వరదలకు మహారాష్ట్ర చిగురుటాకులా వణికింది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా అతి భారీ వర్షాలు కురవగా.. నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి.;
భారీ వరదలకు మహారాష్ట్ర చిగురుటాకులా వణికింది. నైరుతి రుతుపవనాల ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా అతి భారీ వర్షాలు కురవగా.. నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. వర్షాలకు కొంకణ్ తీరం అతలాకుతలమయ్యింది. నదులకు వరద పోటెత్తడం, కొండచరియలు విరిగిపడటంతో వేలాదిమంది నిరాశ్రయులయ్యారు. ముఖ్యంగా రత్నగిరి జిల్లాను వరదలు ముంచెత్తాయి. ఇక రాయ్‌గడ్, సతారా జిల్లాల్లో కొండచరియలు విరిగిపడి బీభత్సం సృష్టించాయి. భారీ వరదలకు రాష్ట్ర వ్యాప్తంగా 136 మంది వరకూ floodsమృతి చెందినట్లు తెలుస్తోంది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇక అత్యధికంగా రాయ్‌గడ్, సతారా జిల్లాల్లో ఎక్కువ మరణాలు చోటుచేసుకున్నాయి.
వరద ఉధృతి అధికంగా ఉన్న ప్రాంతాల్లో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగాయి. 21 ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలు, 14 ఆర్మీ, కోస్టుగార్డు దళాలు, ఎస్‌డీఆర్‌ఎఫ్ బృందాలు, ప్రభుత్వ ఉద్యోగులు సేవల్లో పాల్గొంటున్నారు. పశ్చిమ మహారాష్ట్రలో కొల్హాపూర్ జిల్లాలో 40వేల మందినిసురక్షిత ప్రాంతాలకు తరలించారు. పుణే డివిజన్‌లోని 54 గ్రామాలు వరదలకు తీవ్ర ప్రభావితం కాగా.. 821 గ్రామాల్లో పాక్షికంగా ప్రభావితమయ్యాయి. జిల్లాలో 23 చోట్ల కొండచరియలు కూలినట్టు అధికారులు తెలిపారు.
సతారా జిల్లా అంబేఘర్ వద్ద కొండచరియ కూలిన దుర్ఘటనలో మరో అయిదు మృత దేహాలను గుర్తించారు. ఇక్కడ కనీసం 16 మంది మృతి చెంది ఉంటారని అంచనా వేస్తున్నారు. రాయ్‌గడ్ జిల్లా మహర్ తాలుకా తలాయి గ్రామంలో కొండ చరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్య 44కి పెరిగింది. మరికొందరి ఆచూకీ తెలియాల్సి ఉంది. సాంగ్లీ జిల్లాలో కృష్ణ, కొల్హాపుర్ జిల్లాలో పంచగంగ నదులు ఉద్ధృతంగా ప్రవహిస్తున్నాయి.