పెగాసస్‌పై రాజ్యసభలో రక్షణ శాఖ కీలక ప్రకటన..!
స్పైవేర్ తయారీ సంస్థ, ఇజ్రాయెల్‌కు చెందిన ఎన్‌ఎస్‌వో గ్రూప్‌తో తామకు ఎలాంటి సంబంధం లేదని కేంద్ర రక్షణ శాఖ స్పష్టం చేసింది.;
తీవ్ర దుమారం రేపుతున్న పెగాసస్ స్పైవేర్ వ్యవహారంపై కేంద్రం ఎట్టకేలకు స్పందించింది.. స్పైవేర్ తయారీ సంస్థ, ఇజ్రాయెల్‌కు చెందిన ఎన్‌ఎస్‌వో గ్రూప్‌తో తామకు ఎలాంటి సంబంధం లేదని కేంద్ర రక్షణ శాఖ స్పష్టం చేసింది.. రాజ్యసభలో దీనికి సంబంధించి కీలక ప్రకటన చేసింది. ఆ గ్రూప్ తో ఎలాంటి ఒప్పందాలు చేసుకోలేదని రక్షణ శాఖ వెల్లడించింది. ఎన్‌ఎస్‌వో గ్రూప్ టెక్నాలజీస్‌తో రక్షణశాఖకు ఏమైనా వ్యాపార లావాదేవీలు ఉన్నాయా అని సీపీఎం ఎంపీ శివదాసన్ అడిగిన ప్రశ్నకు రక్షణశాఖ సహాయమంత్రి అజయ్ భట్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ఎన్‌ఎస్‌వో గ్రూప్‌తో రక్షణశాఖ ఎలాంటి లావాదేవీలు జరపలేదని చెప్పారు.
పార్లమెంటు సమావేశాలకు ఒక్కరోజు ముందు పెగాసస్ పై వచ్చిన కథనాలు పెను సంచలనాన్ని సృష్టించాయి.. పెగాసస్ స్పైవేర్‌తో ఇండియా సహా పలు దేశాల ప్రముఖుల ఫోన్లు హ్యాక్ అయినట్లు, ఈ స్పైవేర్ లిస్ట్‌లో భారత్‌కుచెందిన 300 మంది వున్నట్లుగా కథనాలు వచ్చాయి.. దీంతో విపక్షాలు భగ్గుమన్నాయి.. ఈ అంశంపై చర్చకు విపక్షాలు పట్టుబట్టాయి.. అయితే, కేంద్రం నుంచి నిన్నటి వరకు దీనిపై ఎలాంటి సమాధానం లేకపోగా, చర్చ అవసరమే లేదని తోసిపుచ్చింది.. ఆ కథనాలన్నీ ఉద్దేశపూర్వకంగా చేసిన ఆరోపణలేనని కొట్టిపారేసింది.. అయినప్పటికీ, విపక్షాల ఆందోళనలు మాత్రం ఆగలేదు.. చివరకు రాజ్యసభలో దీనిపై కేంద్రం సమాధానం ఇచ్చింది.