కొలిక్కివచ్చిన అన్నాడీఎంకే-బీజేపీ మధ్య సీట్ల పంపకం..!
బీజేపీకి కన్యాకుమారి పార్లమెంటరీ నియోజకవర్గంతో పాటు అసెంబ్లీ ఎన్నికలకు 20 సీట్లు కేటాయించినట్లు ఏఐఏడీఎంకే తెలిపింది.;
తమిళనాడులో అధికార అన్నాడీఎంకే- బీజేపీ మధ్య సీట్ల పంపకం ఓ కొలిక్కి వచ్చింది. బీజేపీకి కన్యాకుమారి పార్లమెంటరీ నియోజకవర్గంతో పాటు అసెంబ్లీ ఎన్నికలకు 20 సీట్లు కేటాయించినట్లు ఏఐఏడీఎంకే తెలిపింది. ఈ మేరకు ఒప్పందంపై శుక్రవారం రాత్రి సీఎం ఎడప్పాడి పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి ఓ పన్నీర్ సెల్వం, బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, తమిళనాడులో పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జి రవి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎల్ మురుగన్ సంతకాలు చేశారు. బీజేపీకి కేటాయించిన నియోజకవర్గాల వివరాలను రెండు రోజుల్లో ప్రకటించనున్నారు.
అధికార పార్టీ తన మొదటి ఆరుగురు అభ్యర్థుల జాబితాను ప్రకటించింది. సీఎం పళనిస్వామి, పన్నీర్‌సెల్వం సహా మరో నలుగురు అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది. 234 అసెంబ్లీ స్థానాల్లో 43 సీట్లను పీఎంకే, బీజేపీలకు కేటాయించింది. కనీసం 170 సీట్లలో పోటీ చేయాలని ఏఐఏడీఎంకే యోచిస్తోంది. కూటమిలోని మరో పార్టీ అయినా డీఎండీకే 25 సీట్లలో బరిలోకి దిగాలని యోచిస్తోంది. 15 అసెంబ్లీ సీట్లు, ఒక రాజ్యసభ సీటును ఆ పార్టీకి కేటాయించాలని భావిస్తోంది. ఇంకా జీకే వాసన్ నేతృత్వంలోని తమిళ మనీలా కాంగ్రెస్, మరో మూడు చిన్న పార్టీలకు సైతం సీట్లు కేటాయించాల్సి ఉంది.