అమెరికాలో తెలుగు వ్యక్తి మృతి.. కూతురు పుట్టిన రోజుకి బెలూన్లు కడుతూ..
పుట్టినరోజు ఏర్పాట్లలో భాగంగా అపార్ట్‌మెంట్ బయట బెలూన్లు కడుతున్న మసూద్‌కి ..;
కూతురి పుట్టిన రోజునాడే భర్త మరణం ఆ ఇంట అంతులేని విషాదాన్ని నింపింది. అనంతపురంకు చెందిన మసూద్ అలీ న్యూజెర్సీలోని ప్లేయిన్స్ బోరోలో భార్య ఆయేషా, కుమార్తె అర్షియాతో ఉంటున్నారు. గురువారం (అక్టోబర్ 1) కుమార్తె అర్షియా పుట్టినరోజు కావడంతో ఇరుగు పొరుగు వారిని ఆహ్వానించారు. పుట్టినరోజు ఏర్పాట్లలో భాగంగా అపార్ట్‌మెంట్ బయట బెలూన్లు కడుతున్న మసూద్‌కి హఠాత్తుగా గుండెపోటు రావడంతో అక్కడే కుప్పకూలిపోయారు. వెంటనే ఆస్పత్రికి తరలించినా ఉపయోగం లేకుండా పోయింది.
చికిత్స పొందుతూ మసూద్ కన్నుమూశారు. హెచ్ 1 స్టేటస్‌లో ఉన్న మసూద్ అలీ.. భార్య, కూతురు కొద్ది నెలల క్రితమే ఇండియా నుంచి అమెరికా వెళ్లారు. వారికి అక్కడ స్నేహితులు, బంధువులు కూడా ఇంకా పరిచయం కాలేదు. ఈ ఘటనతో షాక్ తిన్న మసూద్ కుటుంబం సహాయం కోసం నాట్స్ హెల్ప్‌లైన్‌ను సంప్రదించింది. దీంతో నాట్స్ బృందం హుటాహుటిన వారి ఇంటికి వెళ్లి పరామర్శించింది. అవసరమైన సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చింది. మసూద్ డెడ్ బాడీని స్వదేశానికి తరలించడానికి నాట్స్ ఏర్పాట్లు చేస్తోంది.