Sheikh Hasina : మరణశిక్షపై బంగ్లా మాజీ ప్రధాని హసీనా తొలి స్పందన ఇదే..

హసీనాను అప్పగించాలని భారత్‌ను కోరిన బంగ్లాదేశ్ ప్రభుత్వం

Update: 2025-11-17 23:45 GMT

బంగ్లాదేశ్ మాజీ ప్రధాని షేక్ హసీనా తనకు విధించిన మరణశిక్షపై తొలిసారిగా స్పందించారు. “అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ (ICT) విధించిన మరణశిక్ష పూర్తిగా పక్షపాతంతో కూడినది, రాజకీయంగా ప్రేరేపించినది, చట్టవిరుద్ధమైనది” అని ఆమె అభివర్ణించారు. ఆమెకు ICT మరణశిక్షను విదించినట్లు ప్రకటించిన తర్వాత న్యూఢిల్లీ నుంచి ఒక వార్తా ఛానెల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో 78 ఏళ్ల షేక్ హసీనా మాట్లాడుతూ.. ఈ నిర్ణయం ఎటువంటి అధికారం లేని “నకిలీగా పిలవబడే కోర్టు” నుంచి వచ్చిందని అన్నారు.

షేక్ హసీనా ఆగస్టు 5, 2024 నుంచి భారతదేశంలో ఆశ్రయం పొందుతున్నారు. గత సంవత్సరం విద్యార్థుల హింసాత్మక నిరసనల సందర్భంగా మానవత్వానికి వ్యతిరేకంగా జరిగిన నేరాలకు అంతర్జాతీయ నేరాల ట్రిబ్యునల్ ఆమెను దోషిగా నిర్ధారించింది. తాజాగా ఈ నేరాలపై న్యాయస్థానం వెలువరించిన తీర్పుపై ఆమె మాట్లాడుతూ.. “నాపై ఉన్న అభియోగాలను నేను నిర్ద్వంద్వంగా తిరస్కరిస్తున్నాను. నేను లేనప్పుడు విచారణ జరిగింది, నన్ను నేను సమర్థించుకునే అవకాశం ఇవ్వలేదు, నాకు నచ్చిన న్యాయవాదిని ఉంచుకోవడానికి కూడా నాకు అనుమతి ఇవ్వలేదు” అని ఆమె వెల్లడించారు. “ఐసీటీ గురించి అంతర్జాతీయంగా ఏమీ లేదు. ఈ ట్రిబ్యునల్ అవామీ లీగ్ సభ్యులను మాత్రమే లక్ష్యంగా చేసుకుంటోంది. అయితే ప్రతిపక్ష పార్టీలు చేసిన హింసను పూర్తిగా విస్మరిస్తోంది” అని ఆమె పేర్కొన్నారు. “ప్రపంచంలోని గౌరవనీయమైన, ప్రొఫెషనల్ న్యాయ నిపుణుడు ఎవరూ బంగ్లాదేశ్‌లో ఈ ఐసీటీని గుర్తించరు. బంగ్లాదేశ్‌లో ఎన్నికైన చివరి ప్రధానమంత్రిని అధికారం నుంచి తొలగించి, అవామీ లీగ్‌ను రాజకీయంగా నాశనం చేయడమే దీని ఉద్దేశ్యం” అని హసీనా ఆగ్రహం వ్యక్తం చేశారు.

బంగ్లాదేశ్ తాత్కాలిక ప్రభుత్వ అధిపతి ముహమ్మద్ యూనస్‌పై హసీనా తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. “రాజ్యాంగ విరుద్ధంగా అధికారాన్ని చేజిక్కించుకుని, తీవ్రవాద శక్తులకు మద్దతు ఇస్తున్నారని” యూనస్‌పై ఆరోపణలు చేశారు. యూనస్ పాలనలో విద్యార్థులు, వస్త్ర కార్మికులు, వైద్యులు, ఉపాధ్యాయులు చేపట్టిన శాంతియుత నిరసనలను అణచివేస్తున్నారని, అనేక కాల్పులు జరిగాయని, జర్నలిస్టులను వేధిస్తున్నారని ఆమె వెల్లడించారు. ముహమ్మద్ యూనస్ మద్దతుదారులు దేశవ్యాప్తంగా అవామీ లీగ్ నాయకులు, కార్యకర్తలకు చెందిన వందలాది ఇళ్లు, దుకాణాలు, ఆస్తులను ధ్వంసం చేశారని ఆమె పేర్కొన్నారు. “నాపై ఉన్న అభియోగాలను తటస్థ అంతర్జాతీయ కోర్టులో ఎదుర్కోవడానికి నేను పూర్తిగా సిద్ధంగా ఉన్నాను, అక్కడ సాక్ష్యాలను నిష్పాక్షికంగా పరిశీలించవచ్చు. యూనస్ నేతృత్వంలోని తాత్కాలిక ప్రభుత్వం నా కేసును అంతర్జాతీయ క్రిమినల్ కోర్టు (ICC)కి వెళ్లకుండా నిరోధిస్తోంది, ఎందుకంటే నేను అక్కడ నిర్దోషిగా విడుదల అవుతానని వారికి తెలుసు” అని హసీనా వెల్లడించారు.

భారత్ స్పందన ఇదే ..

ఈ కీలక పరిణామంపై భారత విదేశాంగ శాఖ ఆచితూచి స్పందించింది. బంగ్లాదేశ్ అంతర్జాతీయ నేరాల ట్రైబ్యునల్ ఇచ్చిన తీర్పును పరిగణనలోకి తీసుకున్నట్టు ఒక ప్రకటనలో పేర్కొంది. "పొరుగు దేశంగా, బంగ్లాదేశ్ ప్రజల ప్రయోజనాలకు భారత్ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుంది. ఆ దేశంలో శాంతి, ప్రజాస్వామ్యం, సుస్థిరత నెలకొనాలని కోరుకుంటున్నాం. ఈ లక్ష్యం కోసం సంబంధిత వర్గాలతో నిర్మాణాత్మకంగా వ్యవహరిస్తాం" అని విదేశాంగ శాఖ తెలిపింది. ఈ ప్రకటన ద్వారా భారత్ ఏ పక్షం వహించకుండా తటస్థ వైఖరిని ప్రదర్శించింది.

Tags:    

Similar News