CM Jagan Meet Modi : విభజన హామీలు నెరవేర్చాలని మోదీని కోరిన సీఎం జగన్‌

Jagan Meet Modi : ప్రధాని మోడీతో సమావేశమయ్యారు ఏపీ సీఎం జగన్‌. దాదాపు గంట సేపు రాష్ట్రానికి సంబంధించిన పలు సమస్యలపై ప్రధానితో చర్చించారు సీఎం.

Update: 2022-01-03 15:00 GMT

Jagan Meet Modi : ప్రధాని మోడీతో సమావేశమయ్యారు ఏపీ సీఎం జగన్‌. దాదాపు గంట సేపు రాష్ట్రానికి సంబంధించిన పలు సమస్యలపై ప్రధానితో చర్చించారు సీఎం. రాష్ట్ర సమస్యలపై ప్రధానికి వినతిపత్రం అందించారు. విభజన హామీలు నెరవేర్చాలని మోడీని కోరారు. పోలవరం, విభజన సమస్యలు, అప్పులు, తాకట్లు, ఆర్థిక ఇబ్బందులు సహా ఇతర అంశాలు కూడా ప్రధానితో సమావేశంలో చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది.

రాష్ట్ర విభజన ఆర్థిక పరిస్థితిని తీవ్రంగా దెబ్బతీసిందని ప్రధానికి నివేదించారు జగన్‌. విభజన సమయంలో 58 శాతం జనాభా ఏపీకి వచ్చిందని, కేవలం 45 శాతం మాత్రమే రెవిన్యూ దక్కిందన్నారు. పోలవరం ప్రాజెక్టు అంచనాల భారమంతా రాష్ట్ర ప్రభుత్వం మీదే పడుతుందని మోడీకి వివరించారు జగన్‌. రెవిన్యూ లోటు పూడుస్తామని అప్పటి ప్రధాని హామీ ఇచ్చారని గుర్తు చేశారు జగన్‌. పెండింగ్‌లో ఉన్న 18 వేల 830 కోట్ల రూపాయలు విడుదల చేయాలని ప్రధానికి విజ్ఞప్తి చేశారు.

మోడీతో భేటీతో తర్వాత ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌తో జగన్ సమావేశమయ్యారు. రాష్ట్రానికి ఇవ్వాల్సిన పెండింగ్ నిధులు విడుదల చేయాలని నిర్మలను కోరారు. రాష్ట్రానికి మరింత ఆర్థిక సాయం పెంచాలని కోరారు. వచ్చే బడ్జెట్‌లో పోలవరం, కేంద్ర సంస్థలకు నిధులివ్వాలని విజ్ఞప్తి చేశారు. తర్వాత కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాధిత్య సిందియాతోనూ జగన్‌ సమావేశమయ్యారు. రాష్ట్రంలో విమానాశ్రయాల అభివృద్ధికి తోడ్పాటునందించాలని కోరారు. ఇక రేపు కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీతో సమావేశం కానున్నారు సీఎం జగన్‌.

ఐతే జగన్‌ సడెన్ ఢిల్లీ టూర్‌పై పొలిటికల్‌ సర్కిల్‌లో మరో విధంగా చర్చ జరుగుతోంది. ఇటీవల బీజేపీ ప్రజాగ్రహా సభలో కేంద్ర మాజీ మంత్రి ప్రకాష్ జావడేకర్ చేసిన ఆరోపణ నేపథ్యంలోనే జగన్ మోడీ అపాయింట్‌మెంట్‌ తీసుకున్నారని జోరుగా ప్రచారం జరుగుతోంది. బయటకు విభజన సమస్యలు.. పెండింగ్ నిధులపై చర్చించేందుకు జగన్ ఢిల్లీ వెళ్లారని చెబుతున్నా..స్వార్థ ప్రయోజనాలే కోసమే ఢిల్లీ వెళ్లారంటూ ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. రాష్ట్ర అవసరాల కన్నా వ్యక్తిగత ప్రయోజనాలు, వేడుకోలు కోసమే జగన్.. మోడీని కలిశారని టీడీపీ నేతలు ఆరోపిస్తున్నారు. తన అక్రమాస్తుల కేసులో విచారణ వేగంగా సాగుతున్న నేపథ్యంలోనే జగన్ ఢిల్లీ పర్యటనకు వెళ్లారని విమర్శిస్తున్నారు.

Tags:    

Similar News