Covid third wave : అక్టోబర్‌లో కరోనా థర్డ్ వేవ్ వచ్చే అవకాశం..!
అక్టోబర్‌లో కరోనా థర్డ్ వేవ్ రావచ్చని హెచ్చరించింది నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ కింద ఏర్పాటైన నిపుణుల కమిటీ.;
అక్టోబర్‌లో కరోనా థర్డ్ వేవ్ రావచ్చని హెచ్చరించింది నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ కింద ఏర్పాటైన నిపుణుల కమిటీ. థర్డ్‌వేవ్‌లో పిల్లలపైనే ఎక్కువ ప్రభావం ఉంటుందని ఎన్ఐడిఎం నిపుణుల కమిటీ హెచ్చరించింది. మెరుగైన వైద్య సంసిద్ధత కోసం సన్నద్ధం కావాలని కేంద్రానికి పలు సూచనలు చేసింది ఈ నిపుణుల కమిటీ. అయితే, దేశవ్యాప్తంగా పిల్లలకు మెరుగైన వైద్యం అందించేందుకు.. సరిపడా వైద్య సౌకర్యాలు లేవని, వైద్యులు, సిబ్బంది, వెంటిలేటర్లు, అంబులెన్సులు ,వైద్య పరికరాలు అవసరమైన స్థాయిలో అందుబాటులో లేవని నివేదికలో పేర్కొంది కమిటీ.
నిజానికి ఈ ఆగస్టులోనే కరోనా థర్డ్‌వేవ్ వచ్చేస్తుందని శాస్త్రవేత్తలు సైతం చెప్పారు. కాని, అంచనాలకు భిన్నంగా దేశవ్యాప్తంగా కరోనా వ్యాప్తి కాస్త తగ్గుముఖం పట్టింది. ఆర్-ఫ్యాక్టర్ సైతం ఒకటి కంటే దిగువకు నమోదైంది. రోజువారీగా నమోదవుతున్న కరోనా కేసుల సంఖ్యలోనూ పెద్దగా పెరుగుదల కనిపించడం లేదు. అయితే, కరోనా మళ్లీ విజృంభించదన్న గ్యారెంటీ అయితే లేదని తేల్చి చెబుతున్నారు. వచ్చే నెలలో పండగలు ఉండడంతో.. ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోకపోతే థర్డ్‌వేవ్ కన్ఫామ్ అని చెబుతున్నారు.