Gujarat : నేతల చూపు గుజరాత్ వైపు.. గెలుపే లక్ష్యంగా..
Gujarat : గుజరాత్ అసెంబ్లీ పోలింగ్‌కు తక్కువ సమయం ఉండటంతో గెలుపు కోసం ఎవరి ప్రయత్నాలు వారే చేస్తున్నారు.;
Gujarat: గుజరాత్ అసెంబ్లీ పోలింగ్‌కు తక్కువ సమయం ఉండటంతో గెలుపు కోసం ఎవరి ప్రయత్నాలు వారే చేస్తున్నారు. వరుసగా ఏడోసారి విజయంపై బీజేపీ కన్నేస్తే... 27 ఏళ్ల తర్వాత అధికారం కోసం కాంగ్రెస్ పోరాడుతుంది.. మధ్యలో నేనున్నా అంటూ ఆమ్ ఆద్మీ పార్టీ రెండు పార్టీలకు సవాల్ విసురుతోంది..
పీఎం నరేంద్రమోదీ సొంత రాష్ట్రం కావడంతో కమలం పార్టీ ఇక్కడ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. గత రెండు దశాబ్ధాలుగా పైగా బీజేపీ గుజరాత్‌లో తన పట్టును నిలుపుకుంటూ వస్తోంది.కేంద్రప్రభుత్వ వరాలతో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు మిగతా రాష్ట్రాలతో పోల్చినప్పుడు ఎక్కువుగానే ఉన్నాయనేది ప్రభుత్వ వాదన.27 ఏళ్లుగా వరుసగా అధికారంలో ఉండటంతో ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకత బలంగా ఉందనేది ప్రతిపక్షాల వాదన.
అయితే కేంద్రంలో, రాష్ట్రంలో ఒకే ప్రభుత్వం ఉండటం, పైగా పీఎం స్వరాష్ట్రం కావడంతో ప్రభుత్వ వ్యతిరేకత ఉన్నా గుజరాతీయులు బీజేపీ వైపే మొగ్గుచూపే అవకాశాలు ఉన్నాయని రాజకీయ విశ్లేషకులు విశ్లేషిస్తున్నారు. అదే సమయంలో కాంగ్రెస్ పార్టీకి స్థానికంగా నాయకత్వ సమస్య కూడా ఆ పార్టీకి ఇబ్బందికరంగా మారిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
గతంలో అహ్మద్ పటేల్ గుజరాత్‌లో కాంగ్రెస్‌కు బలమైన నాయకుడిగా ఉండేవారు. ఆయన మృతి తర్వాత.. ఆస్థాయి నాయకుడు హస్తం పార్టీలో లేరు. దీంతో రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ గుజరాత్‌లో విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు.
ఇక మోదీ,అమిత్ షా విస్తృతంగా గుజరాత్‌లో పర్యటిస్తున్నారు. ఇప్పటికే ఎనిమిదికి పైగా ఎన్నికల ర్యాలీల్లో పాల్గొన్నారు. మరోవైపు యూపి సీఏం యోగి ఆదిత్యనాధ్ కూడా గుజరాత్‌లో విస్తృతంగా పర్యటిస్తున్నారు.ఇక కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రకు విరామం ప్రకటించి గుజరాత్ ఎన్నికల ప్రచారంలో పాల్గొంటున్నారు.
ప్రధానంగా నిరుద్యోగం సమస్యను కాంగ్రెస్ హైలెట్ చేస్తోంది. బీజేపీ ప్రభుత్వంలో గుజరాత్‌లో మాటలకే అభివృద్ధిని పరిమితం చేస్తున్నారని విమర్శిస్తూ వస్తోంది. అంతేకాదు అనేక ప్రజాకర్షిక హామీలను గుప్పించింది. ఈ పథకాలే తమకు ఓట్లు తెచ్చిపెడతాయనే ఆశతో హస్తం పార్టీ ఉంది.
పది లక్షల ఉద్యోగాలు,ఐదు వందలకే వంట గ్యాస్ సిలిండర్, రైతు రుణమాఫీ, 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తు వంటి హామీలను మ్యానిఫెస్టోలో పెట్టింది కాంగ్రెస్. మరోవైపు గుజరాత్‌లో సంచలనం సృష్టించేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ రెడీ అయింది. ఆప్ అధినేత కేజ్రీవాల్ గుజరాత్ పై స్పెషల్ ఫోకస్ పెట్టారు.
విద్య, వైద్య సదుపాయాలను మెరుగుపర్చడం, 300 యూనిట్ల ఉచిత విద్యుత్తు వంటి హామీలను ఇవ్వడమే కాకుండా.. ప్రభుత్వంపై వ్యతిరేకంగా ఉన్నవారిని తమవైపు తిప్పుకునే ప్రయత్నం చేశారు. అయితే ఆప్‌కు కేజ్రీవాల్ లాంటి నాయకుడు మరొకరు లేకపోవడం ఆ పార్టీకి మైనస్‌గా మారిందని పొలిటికల్ అనలిస్ట్‌లు విశ్లేషిస్తున్నారు..
ఇక ఎన్నికల ప్రచారాన్ని అన్ని రాజకీయ పార్టీలు హోరెత్తించడంతో గుజరాత్‌లో సందడి నెలకొంది. అన్ని పార్టీల జాతీయ స్థాయి నాయకులు గుజరాత్‌లో పర్యటిస్తూ.. ఓటర్లను ఆకర్షించే పనిలో పడ్డారు. అయితే గుజరాత్ ఓటరు మనసులో ఏముందనేది మాత్రం డిసెంబర్ 8వ తేదీన తేలనుంది. 182 శాసనసభా స్థానాలున్న గుజరాత్‌లో డిసెంబర్1, 5వ తేదీల్లో రెండు విడతల్లో పోలింగ్ జరగనుంది.