Retirement Plan: రిటైర్మెంట్ జీవితం హ్యాపీగా సాగాలంటే.. జెరోధా సీఈఓ టిప్స్

Retirement Plan: ఇంతకాలం ఉద్యోగం చేస్తూ జీవితం సాగించాము. ఇక రిటైర్ అయితే ఎలా ఉంటుందో ఏమో అని మధ్యవయస్కులు ఆందోళన చెందుతుంటారు.;

Update: 2022-12-02 08:38 GMT

Retirement Planning: ఇంతకాలం ఉద్యోగం చేస్తూ జీవితం సాగించాము. ఇక రిటైర్ అయితే ఎలా ఉంటుందో ఏమో అని మధ్యవయస్కులు ఆందోళన చెందుతుంటారు.

అలాంటి వారికోసమే సౌకర్యవంతమైన పదవీ విరమణను ఎలా ప్లాన్ చేసుకోవాలో తెలియజేస్తున్నారు జెరోధా సీఈఓ నితిన్ కామత్. రాబోయే సంవత్సరాల్లో ఆయుర్దాయం పెరగడం, పదవీ విరమణ వయస్సు తగ్గడం జరుగుతుంది అని వివరించారు.


మనలో చాలామంది ఆర్థికంగా సురక్షితమైన పదవీ విరమణ జీవితాన్ని కూడా కోరుకుంటారు. పదవీ విరమణ కోసం ప్రణాళిక చేస్తారు. పొదుపు, పెట్టుబడి వంటి ప్రణాళికలు రచిస్తారు.


సాధారణంగా ముప్పై ఏళ్ల తరవాత పదవీ విరమణ కోసం ప్రణాళికలు వేస్తారు చాలా మంది వ్యక్తులు. అయితే, జెరోధా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) నితిన్ కామత్ అంచనా ప్రకారం ఈ పద్ధతి త్వరలో మారవచ్చు అని అంటున్నారు.


నితిన్ కామత్ ట్విటర్ వేదికగా ఇందుకు సంబంధించిన పలు అంశాలను ప్రస్తావించారు. తన మొదటి ట్వీట్‌లో, సాంకేతిక పురోగతి కారణంగా సగటు పదవీ విరమణ వయస్సు తగ్గుతోందని, వైద్య పురోగతి కారణంగా ఆయుర్దాయం పెరుగుతోందని పేర్కొన్నారు.

రాబోయే 20 ఏళ్లలో పదవీ విరమణ వయస్సు 50 ఏళ్లకు తగ్గుతుందని, ఆయుర్దాయం 80 ఏళ్లకు చేరుకోవచ్చని కామత్ అంచనా వేశారు. మరి "మీరు ఆ మిగిలిన 30 సంవత్సరాలకు ఎలా నిధులు సమకూరుస్తారు?" అని కామత్ ప్రశ్నిస్తున్నారు.


25 ఏళ్ల తర్వాత చాలా దేశాలు ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్యలలో పదవీ విరమణ సంక్షోభం ఒకటి అని ఆయన నొక్కి చెప్పారు. ఇందుకు కొన్ని పరిష్కారాలను సూచిస్తూ నితిన్ కామత్.. అనవసరమైన కొనుగోళ్లకు మరియు భవిష్యత్తులో విలువ తగ్గే విషయాల కోసం రుణాలు తీసుకోవద్దని సలహా ఇచ్చారు.


కుటుంబంలోని ప్రతి సభ్యునికి సమగ్ర ఆరోగ్య బీమాను పొందాలని కోరారు. ఉద్యోగ భద్రత ఎల్లప్పుడూ ఉండదు కాబట్టి, ఆరోగ్య పాలసీని తప్పనిసరిగా కొనుగోలు చేయాలని ఆయన సలహా ఇచ్చారు.


ఎవరైనా డిపెండెంట్‌లను కలిగి ఉంటే, వారికి తగిన టర్మ్ పాలసీని కొనుగోలు చేయాలని నితిన్ కామత్ తెలిపారు. అనుకోని ఆటంకాలు ఎదురైనప్పుడు బ్యాంక్‌లో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేసిన డబ్బు వారి ఆర్థిక అవసరాలను తీర్చగలిగేలా ప్లాన్ చేసుకోవాలి'' అని అతను రాసుకొచ్చారు. 

Tags:    

Similar News