దేశంలో కరోనా.. లక్షల్లో కేసులు.. వేలల్లో మరణాలు

వారాంత కర్ఫ్యూను విధిస్తూ కోవిడ్ నియంత్రణకు చర్యలు చేపట్టాయి. అయినా రికార్డుస్థాయిలో కేసులు పెరుగడం భయాందోళనకు గురిచేస్తోంది.;

Update: 2021-04-17 06:45 GMT

దేశంలో కరోనా కరాళనృత్యం చేస్తోంది. లక్షల్లో కోవిడ్ కేసులు నమోదు కావడం ఆందోళనకు గురిచేస్తోంది. వైరస్ బారిన పడి వేలల్లో జనం ప్రాణాలు కోల్పోతున్నారు. కరోనా కట్టడికి ఇప్పటికే కొన్ని రాష్ట్రాలు కఠిన నిబంధనలు అమలుచేస్తున్నా ఫలితం కనిపించడంలేదు. వారాంత కర్ఫ్యూను విధిస్తూ కోవిడ్ నియంత్రణకు చర్యలు చేపట్టాయి. అయినా రికార్డుస్థాయిలో కేసులు పెరుగడం భయాందోళనకు గురిచేస్తోంది.

దేశంలో కరోనా మహమ్మారి విశ్వరూపం చూపిస్తోంది. గత సంవత్సర కాలంలో ఎన్నడూ లేని విధంగా ఉద్ధృతితో ప్రాణాంతకంగా పరిణమిస్తోంది. మనదేశంలో కరోనా కేసుల వేగం అమెరికా కంటే అధికంగా ఉంది. అగ్రరాజ్యంలో లక్ష నుంచి 2లక్షల కేసులు పెరగడానికి 34 రోజుల సమయం పడితే భారత్‌లో పదిరోజులే పట్టింది. ఒక్క రోజులోనే 2లక్షల 17వేల 353 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్ బారిన పడి 1వెయ్యి 185 మందిప్రాణాలు కోల్పోయారు. దీంతో దేశంలో కరోనాతో మరణించిన వారి సంఖ్య 1లక్ష 74వేల 308కి చేరింది.

దేశవ్యాప్తంగా 14లక్షల 73వేల 210 మందికి కొవిడ్ నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, 2 లక్షల 17వేల 353 కొత్త కేసులు బయటపడ్డాయి. తాజాగా వచ్చిన కేసులతో కలిపి దేశంలోమొత్తం కేసుల సంఖ్య 1కోటి 42లక్షల 91వేల 917 కి చేరింది. ఇక, క్రియాశీల కేసులు 15లక్షలకు పైబడి ఉండటం తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ఆ రేటు 10.46శాతానికి పెరిగింది. ఇక నిన్న లక్షమందికి పైగా కోలుకోవడం కాస్త ఊరటనిచ్చే అంశం.

గడిచిన 24గంటల్లో 1లక్ష18 వేల 302 మంది కోలుకోగా..మొత్తంగా కోటీ 25లక్షల మంది వైరస్‌ను జయించారు. ప్రస్తుతం రికవరీ రేటు 88.31 శాతానికి పడిపోయింది. ఇంతకాలం మహారాష్ట్ర మీద పడగవిప్పిన కరోనా వైరస్ ఇప్పుడు దిల్లీ, ఉత్తర్ ప్రదేశ్‌కు విస్తరిస్తోంది. ఛత్తీస్‌గఢ్‌, ఉత్తర్‌ప్రదేశ్‌, కర్ణాటక, కేరళలో కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. దిల్లీ ఇప్పటికే వారాంతపు కర్ఫ్యూపై ప్రకటన చేసింది.

కరోనా కల్లోలం సృష్టిస్తున్న నేపథ్యంలో దేశంలో మెడికల్‌ గ్రేడ్‌ ఆక్సిజన్‌ లభ్యత, సరఫరాపై ప్రధాని నరేంద్ర మోదీ సమీక్షించారు. వైద్య, ఉక్కు, రవాణా శాఖ మంత్రులు, ఉన్నతాధికారులు ఈ సమీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మోదీ పలు కీలక సూచనలు చేశారు. కేంద్రమంత్రిత్వ శాఖలు, రాష్ట్ర ప్రభుత్వాలు పరస్పరం సమన్వయంతో వ్యవహరించడం ఎంతో ముఖ్యమన్నారు.

కొవిడ్ ఉద్ధృతి అధికంగా ఉన్న 12 రాష్ట్రాలైన- మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, గుజరాత్‌, యూపీ, దిల్లీ, ఛత్తీస్‌గఢ్‌, కర్ణాటక, కేరళ, తమిళనాడు, పంజాబ్‌, హరియాణా, రాజస్థాన్‌లో ఆక్సిజన్‌ సరఫరాపై ఆరా తీశారు. కరోనా తీవ్రత అధికంగా ఉన్న 12 రాష్ట్రాల్లోని వివిధ జిల్లాల్లో నెలకొన్న పరిస్థితులను అధికారులు ప్రధాని వివరించారు.

దేశ వ్యాప్తంగా 24 గంటల పాటు ఆక్సిజన్‌ ట్యాంకర్లు తిరిగేందుకు ఎలాంటి ఆటంకం లేకుండా చూడాలని ప్రధాని ఆదేశించారు. పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా ఆక్సిజన్‌ ఉత్పత్తి గురించి అధికారులు వివరించగా.. ప్రతి ప్లాంట్‌ సామర్థ్యం ప్రకారం ఉత్పత్తిని పెంచాలని మోదీ సూచించారు. సిలిండర్‌ ఫిల్లింగ్‌ ప్లాంట్‌లు అవసరమైన భద్రతా ప్రమాణాలు పాటిస్తూ 24 గంటలు పనిచేసేందుకు అవకాశం కల్పించాలని ఆయన ఆదేశించారు.

Tags:    

Similar News