మార్కెట్లోకి మరో పెట్రోల్.. లీటర్ ధర..
దేశంలోని 10 ప్రముఖ నగరాల్లో ఈ పెట్రోల్ దొరుకుతుంది.;
దేశీ అతిపెద్ద ప్రభుత్వ రంగ ఆయిల్ మార్కెటింగ్ కంపెనీ ఇండియన్ ఆయిల్ తాజాగా వరల్డ్ క్లాస్ ప్రీమియం పెట్రోల్ ఎక్స్‌పీ 100ను అందుబాటులోకి తీసుకువచ్చింది. కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ ఈ పెట్రోల్‌ను మార్కెట్‌లో లాంచ్ చేశారు. దేశంలోని 10 ప్రముఖ నగరాల్లో ఈ పెట్రోల్ దొరుకుతుంది. ప్రపంచంలో ఇలాంటి పెట్రోల్ విక్రయిస్తున్న దేశాల సరసన భారత్ కూడా నిలవనుంది. అమెరికా, జర్మనీ సహా ప్రపంచంలోని మరో 6 దేశాలు మాత్రమే ఇలాంటి ప్రీమియం పెట్రోల్‌ను వినియోగిస్తున్నాయి.
ఈ పెట్రోల్‌ను లగ్జరీ కారు, ప్రీమియం బైక్స్‌లోనే ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. ఢిల్లీ, నోయిడా వంటి చోట్ల ఈ ప్రీమియం పెట్రోల్ ధర లీటరుకు రూ.160గా ఉంది. ఈ పెట్రోల్ వాడకం వల్ల వాహనాల ఇంజన్ పని తీరు మెరుగుపడడంతో పాటు ఎక్కువ కాలం మన్నుతుంది. ఇంకా తక్కువ పొల్యూషన్ కలిగి ఉంటుందని ఆయిల్ కంపెనీ అధినేతలు అంటున్నారు.
కొత్త ఎక్స్‌పి 100 పెట్రోల్‌ని మొదటి దశలో ఢిల్లీ, గురుగ్రామ్, నోయిడా, ఆగ్రా, జైపూర్, చండీగఢ్, ముంబై, లుధియానా, అహ్మదాబాద్, పూణే ఉన్నాయి. ఈ సంస్థ రెండవ దశలో చెన్నై, బెంగళూరు, హైదరాబాద్, కోల్‌కతా, భువనేశ్వర్ వంటి నగరాలకు విస్తరించనుంది. ఈ నగరాలను జనాభా, ప్రీమియం వాహనాల లభ్యత ఆధారంగా ఎంపిక చేసినట్లు కంపెనీ తెలిపింది.