రామ నవమి వేడుకల్లో పెను విషాదం చోటుచేసుకుంది. మధ్యప్రదేశ్ ఇండోర్ పటేల్‌నగర్ ప్రాంతంలోని మహదేవ్ జులేలాల్ ఆలయంలో రామనవమి ఉత్సవాలకు పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఆలయ ప్రాంగణం కిక్కిరిసిపోయింది. స్థలాభావం కారణంగా కొందరు భక్తులు ఆలయ ప్రాంగణంలో ఉన్న మెట్లబావి పైనున్న ఫ్లోరింగ్‌పై కూర్చున్నారు. దీంతో ఫ్లోరింగ్ కుంగి ఒక్కసారిగా కూలిపోయింది. దాదాపు 30 మందికి పైగా భక్తులు బావిలో పడిపోయారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని సహాయకచర్యలు చేపట్టారు. నిచ్చెన సాయంతో కొందరు భక్తులను బయటకు తీసుకొచ్చారు. ఈ ఘటనలో 13 మంది మృతి చెందారు. ఘటనలో పలువురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. సహాయక చర్యలు కొనసాగుతున్నట్లు అధికారులు తెలిపారు. ఘటనపై ప్రధాని మోదీ విచారం వ్యక్తం చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి శివరాజ్ సింగ్ చౌహన్‌కు ఫోన్ చేసి పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. బాధిత కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి ప్రకటిస్తూ ట్వీట్ చేశారు. మృతుల కుటుంబాలకు 5 లక్షలు, గాయపడ్డవారికి 50 వేలు చొప్పున సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ ఎక్స్ గ్రేషియా ప్రకటించారు.