West Bengal : బెంగాల్‌లో హింస.. కేంద్ర హోం శాఖ సీరియస్..!
పచ్చిమ బెంగాల్ లో ఎన్నికల ఫలితాల అనంతరం జరిగిన హింసాత్మక ఘటనలపై కేంద్ర హోంశాఖ ఆ రాష్ట్ర గవర్నర్ జగదీప్ ధన్‌కర్‌ను నివేదిక కోరింది.;
పచ్చిమ బెంగాల్ లో ఎన్నికల ఫలితాల అనంతరం జరిగిన హింసాత్మక ఘటనలపై కేంద్ర హోంశాఖ ఆ రాష్ట్ర గవర్నర్ జగదీప్ ధన్‌కర్‌ను నివేదిక కోరింది. ఇప్పటికే కేంద్రం నలుగురు సభ్యులతో కమిటీ వేసిన సంగతి తెలిసిందే. దీనికి ముందు ఇప్పటికే హింసపై రాష్ట్ర ప్రభుత్వాన్ని కేంద్ర హోంశాఖ నివేదిక కోరినప్పటికీ ఎలాంటి స్పందన లేకపోవడంతో.. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిపై నివేదిక సమర్పించాలని గవర్నర్‌కు సూచించింది.
వీలైనంత త్వరగా నివేదికను సమర్పించాలని కోరింది. అసెంబ్లీ ఫలితాల తర్వాత బెంగాల్‌లో హింసాత్మక ఘటనలు చెలరేగాయి. తమ పార్టీకి చెందిన ఆరుగురు కార్యకర్తలను టీఎంసి మద్దతుదారులు చంపారని బీజేపీ ఆరోపిస్తుంది. అయితే ఈ ఆరోపణను మమతా బెనర్జీ నేతృత్వంలోని ప్రభుత్వం ఖండించింది.
అటు పోలింగ్ తర్వాత జరిగిన అల్లర్లలో చనిపోయిన వారి కుటుంబాలకి సీఎం మమతా బెనర్జీ 2లక్షల రూపాయల పరిహారం ప్రకటించారు. ఈసీ పర్యవేక్షణలో శాంతిభద్రతలు క్షీణించాయని.. దీనితో 16 మంది ప్రాణాలు కోల్పోయారని చెప్పారు.
ఇందులో 8 మంది టీఎంసీ, 7 మంది బీజేపీ, ఒక సంయుక్త మోర్చా కార్యకర్తలు ఉన్నారని తెలిపారు. ఏ పార్టీ అనే వివక్ష లేకుండా అందరికీ పరిహారం ఇస్తామని సూచించారు.