Madhya Pradesh: తల్లి ప్రేమ.. చిరుతపులితో పోరాడి కొడుకును..

Madhya Pradesh: బిడ్డ కోసం పరుగు తీసిన తల్లి.. ఆ ప్రయత్నంలో గెలిచిన తరువాత స్పృహతప్పి పడిపోయింది.

Update: 2021-12-01 07:45 GMT

Madhya Pradesh: పులి నోటికి చిక్కితే బ్రతుకు మీద ఆశలు కోల్పోవాల్సిందే.. అయినా అమ్మ ఆరాటం.. ఆశని వదులుకోలేదు.. తన ప్రయత్నం వమ్ము కాదన్న ఆశ.. 8 ఏళ్ల కొడుకుని చిరుత నోటి నుంచి తప్పించేందుకు మైలు దూరం వరకు పరిగెత్తింది. అమ్మ ప్రేమకి చిరుత కూడా తలవొంచింది. నోట కరిచిన పిల్లాడిని వదిలేసింది.

మధ్యప్రదేశ్‌కు చెందిన మహిళ చిరుతపులిని ఒక మైలు దూరం వెంటాడి తన 8 ఏళ్ల కొడుకును రక్షించుకుంది. బిడ్డ కోసం పరుగు తీసిన తల్లి.. ఆ ప్రయత్నంలో గెలిచిన తరువాత స్పృహతప్పి పడిపోయింది. వెంటనే గ్రామస్తులు ఆమెను సమీపంలోని ఆసుపత్రికి తీసుకువెళ్లారు.

ఈ క్రమంలో తల్లిపై చిరుత రెండుసార్లు దాడి చేసింది. గిరిజన కుటుంబానికి చెందిన కిరణ్‌ బైగా ఆదివారం సాయంత్రం 7 గంటలకు ఇంటి ముందు మంట వేసి దాని ముందు తన ముగ్గురు పిల్లలతో కూర్చున్నారు. ఆ సమయంలో అకస్మాత్తుగా వెనుక నుంచి వచ్చిన చిరుతపులి కిరణ్ 8 ఏళ్ల కుమారుడు రాహుల్‌ను నోటితో పట్టుకుని అడవి వైపు పరుగులు తీసింది.

దాదాపు కిలోమీటరు దూరం ప్రయాణించిన చిరుత అడవిలో ఓ చోట ఆగి చిన్నారిని గోళ్లతో పట్టుకుని కూర్చుంది. కిరణ్ బైగా కొడుక్కోసం పులి వెనకే పరిగెట్టింది. పులితో పోరాడి చిరుత గోళ్ల నుండి తన చిన్నారిని విడిపించుకుంది. చిరుతపులి పిల్లవాడిని విడిచిపెట్టిన తర్వాత, మళ్లీ రెండవసారి దాడి చేసింది.

అయినా ఆమె ధైర్యంగా పులి పంజా పట్టుకుని బలంగా వెనక్కి నెట్టింది. అప్పటికే గ్రామ ప్రజలు అక్కడికి చేరుకోవడంతో చిరుత పారిపోయింది. గ్రామంలో ఇలాంటి సంఘటనలు తరచు జరుగుతుంటాయి. చిరుతపులులు నిరంతరం దాడులు చేయడం ఆ ప్రాంతంలో నివసించే గిరిజన ప్రజలు భయపడుతున్నారు.

Tags:    

Similar News