అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్ధాల కేసులో సంచలన విషయాలు.. రూ.100 కోట్ల వసూళ్లే లక్ష్యంగా..
అక్కడ బాంబు మాత్రమే పేలలేదు గాని.. అంతకు మించిన సెన్సేషన్ క్రియేట్ అవుతోంది.;
ముకేశ్ అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్ధాల వ్యవహారం రోజుకో సంచలన విషయాలను బయటపెడుతోంది. అక్కడ బాంబు మాత్రమే పేలలేదు గాని.. అంతకు మించిన సెన్సేషన్ క్రియేట్ అవుతోంది. తాజాగా మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌పై ముంబై మాజీ సీపీ పరంవీర్ సింగ్ చేసిన ఆరోపణలు సంచలనం సృష్టిస్తున్నాయి. నెలకు వంద కోట్లు వసూలు చేయడమే లక్ష్యంగా మహారాష్ట్ర హోంమంత్రి దేశ్‌ముఖ్ పనిచేస్తున్నాడని ఆరోపించారు. ఈ వంద కోట్లు రాబట్టేందుకు ఎన్‌కౌంటర్ స్పెషలిస్ట్ సచిన్ వాజేను పావుగా వాడుకున్నట్టు మరో బాంబు పేల్చారు.
అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాల వ్యవహారంలో సచిన్ వాజేను ఇప్పటికే అరెస్ట్ చేశారు. ఈ వాజే సేవలను మరోరకంగా ఉపయోగించుకుని ముంబై నగరం నుంచి నెలకు వంద కోట్లు రాబట్టుకుంటున్నాడనేది పరంవీర్ సింగ్ ఆరోపణ. సచిన్ వాజేను మంత్రి అనిల్ దేశ్‌ముఖ్ పదేపదే తన ఇంటికి పిలిపించుకోవడం, వంద కోట్ల టార్గెట్లు పెట్టడం వంటి విషయాలను ఓ లేఖలో రాసి సీఎం ఉద్దవ్ ఠాక్రేకు పంపించారు పరంవీర్ సింగ్.
పరంవీర్ సింగ్‌ను ఈమధ్యే ఉన్నట్టుండి ట్రాన్స్‌ఫర్ చేసింది మహారాష్ట్ర ప్రభుత్వం. అంబానీ కేసులో సరిగా విచారణ చేయడం లేదంటూ బదిలీ చేసింది. అందుకే పరంవీర్ సింగ్ ఈ తరహా వ్యాఖ్యలు చేశారా అన్న అనుమానాలు కూడా ఉన్నాయి. ఈ ఆరోపణల్లో వాస్తవం ఎంతో తెలీదు గాని.. కేంద్రం మాత్రం పరంవీర్‌సింగ్ కామెంట్స్‌ను సీరియస్‌గా తీసుకుంది. అవకాశం దొరకడమే ఆలస్యం శివసేన ప్రభుత్వంపై విరుచుకుపడుతున్న బీజేపీకి.. మాజీ పోలీస్ కమిషనర్ వ్యాఖ్యలు ఓ ఆయుధంగా మారాయి. అసలే అంబానీ ఇంటి ముందు పేలుడు పదార్ధాలు దొరికిన అంశం కావడంతో.. కేంద్రం మరింత చొరవగా వ్యవహరిస్తోంది.
మాజీ పోలీసు కమిషనర్ పరంబీర్ సింగ్ లెటర్‌లో చాలా విషయాలే ఉన్నాయి. నెలకు వంద కోట్ల వసూళ్లు చాలా పెద్ద మొత్తంగా కనిపిస్తున్నా.. అలా వసూలు చేయడం ఎంత సులభమో చెప్పుకొచ్చారు. ఆ లెక్కలు కూడా సాక్షాత్తు హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ చెప్పినవే అని లేఖలో రాశారు. ముంబైలో మొత్తం 1750 బార్లు ఉన్నాయి. వాటి నుంచి 2, 3 లక్షలు వసూలు చేసినా.. నెలకు 40 నుంచి 50 కోట్లు వసూలు చేయొచ్చని స్వయంగా సచిన్ వాజేకు హోంమంత్రి వివరించారని పరంవీర్ సింగ్ చెప్పుకొచ్చారు.
అయితే ఈ ఆరోపణలను హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ ఖండించారు. ముకేశ్ అంబానీ కేసులో, హిరేన్ హత్యలో సచిన్ వాజేకు సంబంధం ఉందని, త్వరలోనే పరంవీర్ సింగ్ పాత్ర కూడా బయటపడుతుందని చెప్పుకొచ్చారు. ఆయన పేరు బయటికొస్తుందని భయపడే.. పరంవీర్‌సింగ్ తనపై ఆరోపణలు చేస్తున్నాడని హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ కౌంటర్ వేశారు. మొత్తానికి బలమైన అవకాశం చిక్కడంతో శివసేన, ఎన్సీపీ ప్రభుత్వాన్ని ఇరుకునపెట్టాలనుకుంటోంది బీజేపీ.