తెలుగు కవి నిఖిలేశ్వర్‌కు అరుదైన గౌరవం లభించింది. ఆయనకు కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారం వరించింది. ఆయన రచించిన అగ్నిశ్వాస కవితా సంపుటికి ఈ అరుదైన పురస్కారం దక్కింది. నిఖిలేశ్వర్ అనేది కలం పేరైతే.. ఆయన అసలు పేరు కుంభం యాదవరెడ్డి. నిఖిలేశ్వర్ కవిగానే కాకుండా అనువాదకుడు, కథకుడు, విమర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. 1956 నుంచి 1964 వరకు తన అసలు పేరుతో వివిధ రచనలు చేశారు. 1965 నుంచి తన కలం పేరును నిఖిలేశ్వర్‌గా మార్చుకుని దిగంబర కవిగా విరజిల్లారు. విప్లవ రచయితల సంఘం వ్యవస్థాపక కార్యదర్శిగా కూడా ఉన్నారు. విప్లవకవిగానే కాకుండా పౌరహక్కుల ఉద్యమంలో కూడా ఆయన పాల్గొన్నారు. 1971లో 'మీసా' చట్టం కింద అరెస్ట్ అయ్యారు. దిగంబరకవులు, మండుతున్న తరం, ఈనాటికీ, నాలుగు శతాబ్దాల సాక్షిగా మహానగరం, ఎవరీ శత్రువులు, జ్ఞాపకాల కొండ, ఖండాంతరాల మీదుగ, యుగస్వరం, కాలాన్ని అధిగమించి, నిఖిలేశ్వర్ కవిత్వం, అగ్నిశ్వాస లాంటి కవితా సంపులను నిఖిలేశ్వర్ రచించారు.
మరోవైపు, ఈ ఏడాది బాల సాహిత్య పురస్కారానికి కన్నెగంటి అనసూయ ఎంపికయ్యారు. ఆమె రచించిన 'స్నేహితులు' అనే లఘు కథా సంపుటి ఈ అరుదైన పురస్కారానికి ఎంపికైంది. అలాగే, సాహిత్య యువ పురస్కారానికి మానస యెండ్లూరి రచించిన 'మిలింద' అనే లఘు కథా సంపుటికి ఈ గౌరవం దక్కింది.సాహిత్య రంగంలో విశేష రచనలకు ఏటా అందించే కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కారాలను కేంద్రం ప్రకటించింది. 2020 ఏడాదికి గానూ మొత్తం 20 భాషల్లో రచనలను ఈ జాతీయ అవార్డులకు ఎంపిక చేసింది.కాంగ్రెస్ సీనియర్ నేత, రచయిత వీరప్ప మొయిలీ కన్నడలో రచించిన శ్రీ బాహుబలి అహింసాదిగ్విజయం అనే ఇతిహాస కవిత్వ సంపుటికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు వరించింది. అలాగే, అరుంధతి సుబ్రహ్మణియం ఆంగ్లంలో రచించిన 'వెన్ గాడ్ ఈజ్ ఏ ట్రావెలర్' అనే కవితా సంపుటి కూడా ఈ పురస్కారానికి ఎంపికైంది.