Sasikala: అన్నాడీఎంకేను హస్తగతం చేసుకోవడానికి శశికళ వ్యూహం.. పార్టీ జనరల్ సెక్రటరీ అంటూ..
Sasikala: అన్నాడీఎంకే స్వర్ణోత్సవాల వేళ తాజా రాజకీయ పరిణామాలు పళనిస్వామి, పన్నీర్‌సెల్వాన్ని టెన్షన్ పెడుతున్నాయి.;
Sasikala (tv5news.in)
Sasikala: అన్నాడీఎంకే స్వర్ణోత్సవాల వేళ తాజా రాజకీయ పరిణామాలు పళనిస్వామి, పన్నీర్‌సెల్వాన్ని టెన్షన్ పెడుతున్నాయి. జయలలిత నెచ్చెలి శశికళ పూర్తిగా యాక్టివ్ అయ్యే ప్లాన్‌తో అడుగులు వేస్తుండడంతో నెక్స్ట్ ఏం జరగబోతోందోననే ఉత్కంఠ కనిపిస్తోంది. ఇవాళ(ఆదివారం) టీనగర్‌లోని MGR మెమోరియల్ వద్దకు వెళ్లిన శశికళ అక్కడ నివాళులు అర్పించారు. పార్టీ జెండాను ఎగురవేశారు. కార్యకర్తలు, అభిమానులకు స్వీట్లు పంచారు. ఓ శిలాఫలకాన్ని కూడా ఆవిష్కరించారు.
ఆ శిలాఫలకంలో జనరల్ సెక్రటరీగా శశికళ పేరే ఉండడం గమనార్హం. ఈ పరిణామాలు చిన్నమ్మ మద్దతుదారుల్లో కొత్త ఉత్సాహాన్ని నింపాయి. ఇదంతా చూస్తుంటే AIADMKను తిరిగి హస్తగతం చేసుకోవడానికే శశికళ వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తోంది. నిన్న జయ సమాధి వద్దకు వెళ్లి నివాళులు అర్పించడం, ఇవాళ MGRకి పుష్పాంజలి ఘటించండం లాంటివన్నీ ఒక ఎత్తయితే.. ఆమె వెంట వేలాదిగా కార్యకర్తలు తరలివెళ్తుండడం ఇంకో ఎత్తుగా చెప్తున్నారు.
ఇదంతా అన్నాడీఎంకే పార్టీలో చీలికకు దారి తీస్తుందా అనే చర్చ కూడా అప్పుడే మొదలైంది. MGR, జయలలితలే పార్టీని కాపాడుకుంటారంటూ చిన్నమ్మ చేసిన వ్యాఖ్యలు కూడా హాట్ టాపిక్ అయ్యాయి. ఆమె కారుకు కూడా పార్టీ జెండాయే ఉండడం సంచలనంగా మారింది. అటు, AIADMK కో-కన్వీనర్లైన మాజీ సీఎంలు పన్నీర్‌సెల్వం, పళనిస్వామి ఇద్దరూ రాయ్‌పేటలోని పార్టీ ప్రధాన కార్యాలయం వద్ద MG రామచంద్రన్, జయలలిత విగ్రహాలకు నివాళులు అర్పించారు. తర్వాత మెరీనా బీచ్‌లోని జయలలిత సమాధి వద్ద అంజలి ఘటించారు.
శశికళ లాంటి వాళ్లతో తమకు వచ్చిన ఇబ్బందేమీ లేదని పైకి గాంభీర్యం ప్రదర్శిస్తున్నా.. ఆ గుబులైతే స్పష్టంగానే కనిపిస్తోంది. 2016లో జయలలిత మరణంతో పార్టీలో ఒక్కసారిగా అంతర్గత సంక్షోభం తలెత్తింది. CM కావాలనుకున్న శశికళను బయటకు పంపి.. పళనిస్వామి CM పగ్గాలు అందుకోగా, పన్నీర్‌సెల్వం పార్టీ బాధ్యతలు చేపట్టారు.
మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాభవం తర్వాత అన్నాడీఎంకే భవితవ్యంపై ఊహాగానాలు మొదలయ్యాయి. ఈ నేపథ్యంలోనే పొలిటికల్ ఎంట్రీకి శశికళ రంగం సిద్ధం చేసుకోవడం, అమ్మ సమాధి వద్దకు, MGR మెమోరియల్‌కు వెళ్లడం, శిలాఫలకంపై తానే జనరల్ సెక్రటరీగా పేరు చెక్కించడం లాంటివి జరగబోయే మార్పులకు సంకేతంగా చెప్తున్నారు విశ్లేషకులు.
1972లో కరుణానిధితో విభేదించి సరిగ్గా ఇదే రోజు పార్టీ పెట్టారు MGR. అన్నా ద్రవిడ మున్నేట్ర గళగం ప్రజల్లోకి వచ్చి చరిత్ర సృష్టించారు. MGR మరణం తర్వాత జయ పార్టీపై పూర్తి పట్టుసాధించడమే కాదు.. ఆరుసార్లు ముఖ్యమంత్రిగానూ తమిళ ప్రజల గుండెల్లో ప్రత్యేక స్థానం పొందారు. అమ్మా అని పిలిపించుకున్నారు. ఆమె మరణంతోనే పార్టీ ప్రతిష్ట మసకబారుతూ వచ్చింది. ప్రస్తుతం 50 ఏళ్ల సంబరాలు జరుపుకుంటున్న వేళ.. EPS, OPS ఒకవైవు.... శశికళ మరోవైపు పార్టీపై పట్టుకోసం ప్రయత్నాలు చేస్తుండడంతో రాజకీయం రసవత్తరంగా మారింది.