దేశంలో ఇద్దరు పిల్లల్లో ఒకరికి కరోనా యాంటీబాడీలు..40 కోట్ల మందికి ఇన్ఫెక్షన్..
Sero Survey Report: దేశంలో మూడింట రెండు వంతుల మందిలో కరోనా యాంటీబాడీలు వృద్ధి చెందినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించింది.;
Covid Antibodies
Sero Survey Report: దేశంలో మూడింట రెండు వంతుల మందిలో కరోనా యాంటీబాడీలు వృద్ధి చెందినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ తాజాగా వెల్లడించింది. ఇంకా 40 కోట్ల మందికి ఈ వైరస్ ముప్పు పొంచి ఉన్నదని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా నాలుగో జాతీయ సెరో సర్వేను రిలీజ్ చేసింది. కరోనా వైరస్ ప్రభావాన్ని, ప్రాబల్యాన్ని అంచనా వేసేందుకు కేంద్ర ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో సెరో సర్వే నిర్వహిస్తున్నారు.
ప్రతి జిల్లాలో 100 హెల్త్ కేర్ వర్కర్లు ఈ సర్వే కోసం పనిచేశారు. సర్వేలో భాగంగా జూన్-జులై మధ్యకాలంలో భారత వైద్య పరిశోధనా మండలి జాతీయ స్థాయిలో నాలుగో సెరో సర్వే చేపట్టింది. ఇందుకోసం ఈసారి చిన్నారులను కూడా పరిగణలోకి తీసుకుంది. తాజా సర్వే ప్రకారం దేశంలో 6 నుంచి 17 ఏళ్ల మధ్య వయసున్న పిల్లల్లో 50 శాతానికిపైగా కరోనా యాంటీబాడీలు వృద్ధి చెందినట్లు గుర్తించారు.
అత్యధికంగా 45 నుంచి 60 ఏళ్ల వయసున్న వాళ్లలో 77.6 శాతం మందికి, ఆ తర్వాత 60 ఏళ్లు పైబడిన వాళ్లలో 76.7 శాతం మందికి, 18-44 ఏళ్ల వయసు వాళ్లలో 66.7 శాతం మందిలో కరోనా యాంటీబాడీలు ఉన్నట్లు సెరో సర్వే తేల్చింది. సర్వేలో పిల్లలను రెండు గ్రూపులు విభజించారు. 6-9 ఏళ్లు మొదటి గ్రూప్ కాగా.. 10 నుంచి 17 ఏళ్ల వారు రెండో గ్రూప్‌లోకి వస్తారు. వీళ్లలో 6నుంచి 9 గ్రూపులో 57.2 శాతం మందిలో, 10 నుంచి17 వయసు వాళ్లలో 61.6 శాతం మందిలో యాంటీబాడీలు వృద్ధి చెందినట్లు ఐసీఎంఆర్ పేర్కొంది.