Uttar Pradesh : మార్చురీ ఫ్రీజర్‌లో ఏడు గంటలు.. మరణించాడనుకున్న వ్యక్తి మళ్లీ బతికి..

Uttar Pradesh: పోయిన వాళ్లు ఎలా తిరిగివస్తారని మళ్లీ మనకి మనమే సముదాయించుకుని, ఆ చేదు నిజాన్ని జీర్ణించుకుని బతకాల్సిన పరిస్థితి.

Update: 2021-11-22 06:00 GMT

Uttar Pradesh: మరణించిన వ్యక్తి మళ్లీ బతికి వస్తే బావుండని వారితో అనుబంధం పెనవేసుకున్న వారికి ఉండడం సహజం. అయితే పోయిన వాళ్లు ఎలా తిరిగివస్తారని మళ్లీ మనకి మనమే సముదాయించుకుని, ఆ చేదు నిజాన్ని జీర్ణించుకుని బతకాల్సిన పరిస్థితి. కానీ కొన్ని సంఘటనలో మరణించాడని వైద్యులు ధృవీకరించినా వారిలో ప్రాణం ఉంటుంది.. కుటుంబసభ్యులు గుర్తించి మళ్లీ చికిత్స చేయించడంతో బ్రతికిన సందర్భాలు అక్కడక్కడా వెలుగుచూస్తుంటాయి.

తాజాగా ఉత్తరప్రదేశ్‌లో జరిగిన ఈ ఘటన కూడా ఇదే మాదిరిగా ఉంది. రాష్ట్ర నివాసి అయిన శ్రీకేష్ కుమార్ అనే వ్యక్తి మొరాదాబాద్ మునిసిపల్ కార్పొరేషన్‌లో ఎలక్ట్రీషియన్‌గా పనిచేస్తున్నాడు. గురువారం నాడు రోడ్డు ప్రమాదానికి గురై అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. వైద్య పరీక్షల్లో అతడు ప్రాణాలు కోల్పోయాడని ధృవీకరించారు వైద్యులు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రి మార్చురీలోని ఫ్రీజర్‌లో ఏడు గంటల పాటు ఉంచారు.

తరువాతి రోజు శవ పరీక్షకు అంగీకరిస్తూ కుటుంబసభ్యులు పంచనామాపై సంతకాలు చేయడం ప్రారంభించారు. ఈ క్రమంలో శ్రీకేష్ మరదలు అతడి మృతదేహాన్ని చూసి షాక్‌కు గురైంది. శ్రీకేష్‌ ఊపిరి ఆడుతున్నట్లు గుర్తించింది. వెంటనే కుటుంబసభ్యులకు సమాచారం అందించింది. వారు హుటాహుటిన వైద్యులకు సమాచారం చేరవేయడంతో వైద్యులు అప్రమత్తమై శ్రీకేష్‌‌ని ఫ్రీజర్ నుంచి బయటకు తీసి చికిత్స అందించారు.

అనంతరం అతడి ఆరోగ్య పరిస్థితి మెరుగుపడడంతో కుటుంబసభ్యులు కుదుటపడ్డారు. చనిపోయాడనుకుని భావించిన శ్రీఖేష్ మృత్యుంజయుడిగా నిలిచి అందరినీ ఆశ్చర్యపరిచాడు. కాగా, మరణించాడని ధృవీకరించిన డాక్టర్లపై ఆస్పత్రి యాజమాన్యం తీవ్ర చర్యలు తీసుకుంది. 

Tags:    

Similar News