Air India: 68ఏళ్లు.. రూ.18 వేల కోట్లు.. టాటాలదే ఎయిర్ ఇండియా..
Air India: ఇండియన్ మహారాజా ఎయిరిండియా ప్రైవేటీకరణపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది.;
Air India: ఇండియన్ మహారాజా ఎయిరిండియా ప్రైవేటీకరణపై కేంద్ర ప్రభుత్వం కీలక ప్రకటన చేసింది. బిడ్డింగ్ లో పలు సంస్థలు పాల్గొన్నా ఎక్కువ కోట్ చేసిన టాటా సన్స్‌ను ఎంపిక చేసినట్లు కేంద్ర పెట్టబడులు, ప్రభుత్వ ఆస్తుల నిర్వహణ విభాగం కార్యదర్శి తుహిన్ కాంత పాండే అధికారికంగా వెల్లడించారు. తాజాగా కేంద్రం ప్రకటనతో 68ఏళ్ల తర్వాత ఎయిరిండియా తిరిగి టాటాల చేతుల్లోకి వెళ్లనుంది.
ఎయిరిండియాను దక్కించుకునేందుకు గత నెల పలు సంస్థలు ఆర్థిక బిడ్లు దాఖలు చేశాయి. బిడ్ మొత్తంలో ఎయిరిండియా రుణాలకు 85 శాతం, నగదుగా 15 శాతం బిడ్డర్లు చెల్లించాల్సి ఉంటుంది. ఎయిరిండియా రిజర్వ్ ప్రైస్‌ను 12 వేల 906 కోట్లుగా నిర్ణయించినట్లు తుహిన్ కాంత తెలిపారు. టాటా సన్స్ బిడ్‌లో కోట్ చేసిన 18వేల కోట్లు.. రిజర్వ్ ప్రైస్ కంటే ఎక్కువ.
భవిష్యత్తుల్లో సంస్థ పునరుద్ధరణపై టాటాలు సమర్పించిన ప్రణాళిక ఆకర్షణీయంగా ఉండడంతో ఎంపిక చేసినట్లు చెప్పారు. 18వేల కోట్లలో 15,300 కోట్ల రుణాలను టాటా సన్స్ తమ చేతుల్లోకి తీసుకోనుంది. మిగిలిన 2,700 కోట్లను నగదు రూపంలో ప్రభుత్వానికి చెల్లించనుంది. ఎయిరిండియాలో 100 శాతం వాటాలతో పాటు.. అనుబంధ సంస్థ ఎయిరిండియా ఎక్స్‌ప్రెస్ సైతం పూర్తిగా టాటాలపరం కానుంది.
గ్రౌండ్ హాండ్లింగ్ కంపెనీ ఎయిరిండియా శాట్స్ ఎయిర్‌పోర్ట్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ లోనూ టాటాలకు 50 శాతం వాటాలు దక్కనున్నాయి. దేశీయ ప్రయాణాలకు 4400, అంతర్జాతీయ ప్రయాణాలకు 1800 ల్యాండింగ్, పార్కింగ్ స్లాట్‌లు ఎయిరిండియాకు ఉన్నాయి. విదేశీ విమానాశ్రయాల్లో 900 స్లాట్‌లున్నాయి. ప్రస్తుతం ఎయిరిండియాలో ఉన్న ఉద్యోగులందరినీ టాటా సన్స్ ఏడాది పాటు విధుల్లో కొనసాగించాలి.
రెండో సంవత్సరంలో వారికి వీఆర్ఎస్ అవకాశం ఇవ్వొచ్చు. అలాగే ఎయిరిండియా బ్రాండ్‌ను, లోగోను ఐదేళ్ల వరకు టాటా సన్స్ ఇతరులకు బదిలీ చేయడానికి వీలులేదు. నిజానికి ఎయిరిండియాను ప్రారంభించింది టాటాలే. 1932లో టాటా ఎయిర్‌లైన్స్ పేరిట టాటా గ్రూప్ విమానయాన రంగంలోకి ప్రవేశించింది. 1953లో జాతీయీకరణతో ఈ సంస్థ ప్రభుత్వ పరమైంది. అయితే, 1977 వరకు సంస్థ నిర్వహణలో టాటా కీలక పాత్ర పోషించింది.
68 ఏళ్ల తర్వాత వారు ప్రారంభించిన సంస్థ తిరిగి వారి చేతుల్లోకే వెళ్లడం విశేషం. డిసెంబరు నాటికి ఎయిరిండియా పూర్తి స్థాయిలో టాటా సన్స్ చేతుల్లోకి వెళ్లిపోతుంది. ప్రస్తుతం టాటాలకు ...ఎయిర్ ఏషియాలో 83.67 శాతం వాటా, విస్తారాలో 51 శాతం వాటా, సింగపూర్ ఎయిర్‌లైన్స్ లో 49 శాతం వాటాలున్నాయి. వీటన్నింటినీ ఎయిరిండియా కిందకు తీసుకురావాలని టాటాలు యోచిస్తున్నట్లు సమాచారం.