మధ్యప్రదేశ్‌లో రోడ్డుపక్కన కొవాగ్జిన్ టీకాలు.. ఓ ట్రక్కులో 2.40 లక్షల కొవాగ్జిన్ డోసులు
అసలే కరోనా టీకాలు దొరకక జనం అల్లాడుతుంటే... మధ్యప్రదేశ్‌లో రోడ్డు పక్కన రెండు లక్షల 40 వేల కొవాగ్జిన్ డోసులు ప్రత్యక్షమయ్యాయి;
అసలే కరోనా టీకాలు దొరకక జనం అల్లాడుతుంటే... మధ్యప్రదేశ్‌లో రోడ్డు పక్కన రెండు లక్షల 40 వేల కొవాగ్జిన్ డోసులు ప్రత్యక్షమయ్యాయి. స్టాక్‌తో ఉన్న ట్రక్కును రోడ్డు పక్కన వదిలేసి పత్తాలేకుండా వెళ్లారు డ్రైవర్, క్లీనర్లు. నర్సింగ్‌పూర్ జిల్లాలో ఈ ఘటన ఉదయం వెలుగు చూసింది. కరేలీ ప్రాంతంలోని బస్టాండ్‌కు సమీపంలో ఓ ట్రక్కు చాలాసేపటి నుంచి ఆగి ఉండడంతో అనుమానం వచ్చిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు.
రంగంలోకి దిగిన పోలీసులు ట్రక్కు డోర్‌ను తెరిచి చూసి షాకయ్యారు. ఎందుకంటే అందులో 2 లక్షల 40 వేల డోసుల కొవాగ్జిన్ వ్యాక్సిన్లు ఉన్నాయి. వీటి విలువ దాదాపు 8 కోట్లు ఉంటుందని పోలీసులు తెలిపారు. ట్రక్కు మీదున్న నంబరుతో డ్రైవర్ మొబైల్ లొకేషన్‌ను పోలీసులు ట్రేస్ చేశారు. హైవే సమీపంలోని చెట్ల పొదల్లో ఫోన్ ఉన్నట్లు గుర్తించారు. ట్రక్కును స్వాధీనం చేసుకున్న పోలీసులు డ్రైవర్, క్లీనర్‌ల కోసం గాలిస్తున్నారు. ట్రక్కులోని ఎయిర్ కండిషన్ పనిచేస్తుండడంతో వ్యాక్సిన్ డోసులు సురక్షితంగానే ఉన్నట్లు పోలీసులు తెలిపారు.