Varanasi Temple Dispute : బాబ్రీ వంటి మరో వివాదం

Varanasi Temple Dispute : రామజన్మభూమి, బాబ్రీ మసీదు వంటి మరో వివాదం తెరపైకి వచ్చింది. కాశీవిశ్వనాథుని ఆలయానికి..

Update: 2021-04-10 12:30 GMT

Varanasi Temple Dispute : రామజన్మభూమి, బాబ్రీ మసీదు వంటి మరో వివాదం తెరపైకి వచ్చింది. కాశీవిశ్వనాథుని ఆలయానికి (Varanasi Temple Dispute) ఆనుకుని ఉన్న మసీదు... గుడిని కూల్చి కట్టిందనే వాదన ఉంది. దీనిపై గత కొన్నేళ్లుగా కోర్టులో కేసు నడుస్తోంది. అయితే ఆ మసీదు ప్రాంగణంతోపాటు కాశీ విశ్వనాథుని ఆలయం చుట్టూ సర్వేకు వారణాసి కోర్టు ఆదేశించింది.

కాశీ విశ్వనాథుని ఆలయ ప్రాంగణంలో సర్వేకు అనుమతి

ఉత్తరప్రదేశ్‌లోని వారణాసిలో కాశీ విశ్వనాథుని ఆలయం ఉంది. పరమశివుడి ఈ ఆలయం దేశంలోనే చాలా ప్రఖ్యాతిగాంచింది. అయితే ఈ గుడి ప్రాంగణానికి ఆనుకుని జ్ఞానవాపి మసీదు ఉంది. ఆలయంలోని కొంత భాగాన్ని కూల్చి ఈ మసీదును ఔరంగజేబు హయాంలో కట్టారంటూ న్యాయవాది విజయ్ శంకర్ రస్తోగీ కోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌ను విచారించిన వారణాసి కోర్టు.. జ్ఞానవాపి మసీదు ఏరియాతోపాటు కాశీ విశ్వనాథుని ఆలయ ప్రాంగణంలో సర్వే చేయడానికి ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా-ASIకి అనుమతిని ఇచ్చింది. అంతేకాదు ఐదుగురు సభ్యులతో ఒక కమిటీని వేయాలని కోర్టు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ జనరల్‌ను ఆదేశించింది. అయితే ఆ కమిటీలో కనీసం ఇద్దరు మైనార్టీ సభ్యులు ఉండేలా చూడాలని సూచించింది.

1991 నుంచి నడుస్తున్న వివాదం

జ్ఞానవాపి మసీదు ప్రాంగణంలో ASI సర్వేను మసీదు ప్యానెల్ గత ఏడాది జనవరిలో వ్యతిరేకించింది. నిజానికి ఈ వివాదం 1991 నుంచే నడుస్తోంది. అప్పట్లో దీనిపై వారణాసి సివిల్ కోర్టులో స్వయంభు జ్యోతిర్లింగ భగవాన్ విశ్వేశ్వర్ పిటిషన్ దాఖలు చేసింది. జ్ఞానవాపి ప్రాంగణం కాశీ విశ్వనాథుని ఆలయంలో భాగమని ప్రకటించాలని కోర్టును కోరింది. అంతేకాదు ఈ ప్రాంతం నుంచి ముస్లీంలను వెళ్లగొట్టి మసీదును కూల్చివేసేలా ఆదేశించాలని కోర్టుని కోరారు. మసీదు స్థానంలో హిందూ దేవాలయాన్ని నిర్మించాలని కోర్టుకు విజ్ఞప్తి చేశారు.

22 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న కేసు

మరోవైపు మసీదుకు సంబంధించిన స్థల వివాదం సివిల్ కోర్టు పరిధిలోకి రాదంటూ అంజుమన్ ఇంతెజామియా మజీద్ కమిటీ 1998లో అలహాబాద్ హైకోర్టును ఆశ్రయించింది. దీంతో హైకోర్టు స్టే ఇచ్చింది. అప్పటి నుంచి 22 ఏళ్లుగా ఈ కేసు పెండింగ్‌లో ఉంది. ఇక స్వయంభు జ్యోతిర్లింగ భగవాన్ విశ్వేశ్వర్ తరఫున లాయర్ విజయ్ శంకర్ రస్తోగీ వారణాసి జిల్లా కోర్టులో పిటిషన్ వేశారు. జ్ఞాన్‌వాపి మసీదు ప్రాంగణాన్ని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాతో సర్వే చేయించాలని కోరారు. ఇక గత ఏడాది జనవరిలో సర్వే చేయాలనే అభ్యర్థనను మసీదు కమిటీ వ్యతిరేకించింది. దీంతో గత ఏడాది ఫిబ్రవరిలో రస్తోగీ కింది కోర్టులో పిటిషన్ వేశారు. దీన్ని విచారించిన వారణాసి కోర్టు సర్వే చేయడానికి ASIకి అనుమతిని ఇచ్చింది.  

Tags:    

Similar News