Viral: పిచ్చి వేషాలకు చెక్ పెట్టాల్సిందే...!
జాతీయగీతం అపహస్యం చేసిన యువతులపై నెటిజెన్ల కన్నెర్ర; అరెస్ట్ చేయాల్సిందిగా డిమాండ్
సోషల్ మీడియాలో ఏం చేసినా చెల్లుబాటు అయిపోతుంది అనుకుంటే పొరపాటే. హాస్యానికి, అపహాస్యానికి హద్దులు మరిస్తే మొదటికే మోసం వస్తుంది. అయినప్పటికీ కొందరు అతి ప్రవర్తనతో కోరి కష్టాలు కొనితెచ్చుకుంటారు. సభ్యసమాజం ముందు దోషులుగా నిలుస్తున్నారు. తాజాగా ఇదే రీతిన ఇద్దరు అమ్మాయిలు అతి చేష్ఠలు చేసి యావత్ దేశం ముందు తలదించుకునే పరిస్థితి తెచ్చుకున్నారు. భారత జాతీయగీతాన్ని అపహాస్యం చేస్తూ వీరు చేసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వ్యూస్ కోసమో, లైక్స్ కోసమో తెలీదు కానీ, కూర్చుని జాతీయ గీతాన్ని ఆలపించడమే కాకుండా, చేతిలో సిగరెట్ తో ఇరువురు చేసిన వీడియో సమాజంలో పెరుగుతోన్న విపరీత ధోరణులకు అద్దం పడుతోంది. ఈ విపరీత చర్యపై నెటిజెన్లు సైతం భగ్గుమంటున్నారు. సదరు యువతులపై చర్యలు తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తున్నారు. ఓ న్యాయవాది ఈ వీడియోను రీ ట్వీట్ చేస్తూ వీరిపై తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని కోరారు.