India Oil Imports : భారత చమురు మార్కెట్‌లో పెను సంచలనం.. రష్యా పతనానికి మొదలైన కౌంట్ డౌన్.

Update: 2026-02-20 08:00 GMT

India Oil Imports : ప్రపంచంలోనే మూడో అతిపెద్ద ముడి చమురు వినియోగదారుగా ఉన్న భారత్, తన చమురు దిగుమతుల వ్యూహాన్ని ఒక్కసారిగా మార్చేసింది. గత రెండేళ్లుగా రష్యాతో సాగించిన చౌక చమురు బంధానికి మెల్లమెల్లగా బ్రేకులు పడుతున్నాయి. అమెరికాతో కుదిరిన కొత్త వాణిజ్య ఒప్పందాలు, అంతర్జాతీయ ఆంక్షల నేపథ్యంలో భారత ఓడరేవుల్లో ఇప్పుడు రష్యా ట్యాంకర్ల కంటే సౌదీ అరేబియా, ఇతర ఓపెక్ (OPEC) దేశాల చమురు నౌకలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఎకనామిక్స్ టైమ్స్ రిపోర్ట్ ప్రకారం.. భారత్ మళ్లీ తన పాత మిత్రులైన మధ్యప్రాచ్య దేశాల వైపు మొగ్గు చూపుతోంది. దీనివల్ల దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

రష్యా-ఉక్రెయిన్ యుద్ధం మొదలైన కొత్తలో, పాశ్చాత్య దేశాల ఆంక్షలను లెక్కచేయకుండా భారత్ రష్యా నుంచి భారీగా చమురు కొనుగోలు చేసింది. ఒకప్పుడు మన మొత్తం దిగుమతుల్లో కేవలం ఒక శాతంగా ఉన్న రష్యా వాటా, యుద్ధం తర్వాత ఏకంగా 40 శాతానికి పెరిగిపోయింది. కానీ, ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. జనవరి 2026 నాటికి రష్యా నుంచి దిగుమతులు రోజుకు 1.1 మిలియన్ బారెల్స్‌కు పడిపోయాయి. ఇది నవంబర్ 2022 తర్వాత నమోదైన అత్యంత కనిష్ట స్థాయి. రష్యా వాటా ఇప్పుడు 21.2 శాతానికి కుంచించుకుపోయింది. మరోవైపు, రష్యా వదులుకున్న ఈ మార్కెట్‌ను చైనా తన కైవసం చేసుకుంటోంది. ప్రస్తుతం ప్రపంచంలో రష్యా చమురును అత్యధికంగా కొంటున్న దేశంగా చైనా అవతరించింది.

రష్యా నుంచి దూరం జరుగుతున్న క్రమంలో సౌదీ అరేబియా మళ్లీ తన నంబర్ వన్ స్థానాన్ని దక్కించుకుంది. ఫిబ్రవరి నెలలో సౌదీ నుంచి చమురు దిగుమతులు రికార్డు స్థాయికి చేరుకున్నాయి. గణాంకాలను పరిశీలిస్తే.. డిసెంబర్ నాటికి రష్యా దిగుమతులు 15 శాతం తగ్గగా, అదే సమయంలో సౌదీ అరేబియా నుంచి కొనుగోళ్లు ఏకంగా 60 శాతం పెరిగి 1.8 బిలియన్ డాలర్లకు చేరాయి. అంతేకాదు, అమెరికా నుంచి కూడా చమురు దిగుమతులు 31 శాతం మేర పెరిగాయి. దీనివల్ల గత 11 నెలల్లో ఎన్నడూ లేనంతగా భారత మార్కెట్‌లో ఓపెక్ దేశాల హవా మళ్లీ పెరిగింది.

రాబోయే రోజుల్లో రష్యా నుంచి వచ్చే చమురు దిగుమతులు మరింత తగ్గే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. మార్చి నెల నాటికి ఇది రోజుకు 8 లక్షల బారెల్స్‌కు పడిపోవచ్చని భావిస్తున్నారు. అయితే, రష్యా నుంచి దిగుమతులను రాత్రికి రాత్రే పూర్తిగా నిలిపివేయడం సాధ్యం కాదు కాబట్టి, క్రమక్రమంగా తగ్గిస్తూ ఇతర దేశాల నుంచి సరఫరాను పెంచుకోవాలని భారత్ భావిస్తోంది. ఓపెక్ దేశాల నుంచి తక్కువ ధరకే చమురు లభిస్తే, సామాన్యుడికి ఇంధన ధరల భారం నుంచి కొంత ఉపశమనం లభించే ఛాన్స్ ఉంది.

Tags:    

Similar News