India-Russia Annual Summit: భారత్‌లో పుతిన్.. రక్షణ, వాణిజ్య పెట్టుబడులపై ఇరుదేశాల మధ్య ఒప్పందాలు..

India-Russia Annual Summit: భారత్-రష్యా దేశాల మధ్య సంబంధాలు సుస్థిరంగా ఉన్నాయని ప్రధాని మోదీ అన్నారు.

Update: 2021-12-06 14:58 GMT

India-Russia Annual Summit: భారత్-రష్యా దేశాల మధ్య సంబంధాలు సుస్థిరంగా ఉన్నాయని ప్రధాని మోదీ అన్నారు. ఢిల్లీలోని హైదరాబాద్ భవన్‌లో రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో ప్రధాని మోదీ ప్రత్యేకంగా భేటీ అయ్యారు. రక్షణ, ఇంధన, వాణిజ్యం, పెట్టుబడులపై ఇరుదేశాల మధ్య కీలక ఒప్పందాలు చేసుకున్నాయి. అనంతరం అఫ్గానిస్థాన్‌లో నెలకొన్న పరిస్థితులపై ఇరువురు నేతలు చర్చించారు.

రెండు దేశాల మధ్య వ్యూహాత్మక భాగస్వామ్యం, భారత్‌తో పుతిన్‌కు ఉన్న అనుబంధాన్ని మోదీ గుర్తు చేశారు. కొవిడ్‌ సంక్షోభ సమయంలో వ్యాక్సిన్‌తో పాటు మానవతా సహాయంలో ఇరు దేశాలు పూర్తి సహకారం అందించుకున్నాయన్నారు. ఆర్థికరంగంలోను భారత్-రష్యా పరస్పరం సహకారాన్నిఅందిపుచ్చుకుంటున్నాయని తెలిపారు. మారుతున్న ప్రపంచ రాజకీయాలను ప్రస్తావించిన మోదీ.. ఎన్ని మార్పులు వస్తున్నా ఇరు దేశాల మధ్య సంబంధాలు బలంగా ఉన్నాయని స్పష్టంచేశారు.

భారత్‌తో రష్యాకు చిరకాల బంధమని పుతిన్ కొనియాడారు. ఇరు దేశాల మధ్య సంబంధాలు పెరుగుతున్నాయన్న రష్యా అధ్యక్షుడు.. ఉగ్రవాదం గురించి తాము ఆందోళన చెందుతున్నామని తెలిపారు. ఉగ్రవాదం, మాదక ద్రవ్యాల అక్రమ రవాణాపై పోరాటం చేయాల్సిన అవసరం ఉందని పుతిన్ స్పష్టంచేశారు. అంతకుముందు.. భారత్‌, రష్యాల మధ్య జరుగుతున్న ద్వైపాక్షిక వార్షిక సదస్సులో పాల్గొనేందుకు పుతిన్ ఢిల్లీ చేరుకున్నారు. విమానాశ్రయంలో దిగిన ఆయనకు ప్రధాని మోదీ స్వాగతం పలికారు. అనంతరం హైదరాబాద్‌ హౌస్‌కు చేరుకున్న ఇరువురు నేతలు ప్రత్యేకంగా భేటీ అయ్యారు. 

Tags:    

Similar News