Ukraine Russia: పుతిన్‌ను మృగంతో పోల్చిన జెలెన్‌స్కీ.. 3 లక్షల మందిని బందీ చేశారంటూ..
Ukraine Russia: ఓ వైపు కాల్పుల విరమణ అంటూనే.. అందుకు విరుద్ధంగా భారీ బాంబులు, క్షిపణులతో విరుచుకుపడుతోంది.;
Ukraine Russia: ఉక్రెయిన్‌పై దాడులను తీవ్రతరం చేస్తోంది రష్యా. ఓ వైపు కాల్పుల విరమణ అంటూనే.. అందుకు విరుద్ధంగా నివాస గృహాలే లక్ష్యంగా భారీ బాంబులు, క్షిపణులతో విరుచుకుపడుతోంది. తాజాగా సుమీ నగరంలో రష్యా సేనలు చేసిన భారీ బాంబు దాడిలో 18 మంది పౌరులు మృతిచెందినట్లు ఉక్రెయిన్ వెల్లడించింది. మృతుల్లో ఇద్దరు చిన్నారులు కూడా ఉన్నట్లు తెలిపింది.
చెర్నివిహ్‌లోని ఓ భవనంపైనా రష్యా సేనలు ఇదే తరహా దాడికి పాల్పడగా.. అదృష్టవశాత్తూ ఆబాంబు పేలలేదు. రష్యా ఇలాంటి అనేక దాడులను చేస్తూ అమాయక ప్రజలు, పిల్లల ప్రాణాలను బలితీసుకుంటోందని ఉక్రెయిన్ ఆవేదన వ్యక్తం చేసింది. అటు మేరియుపోల్‌లో రష్యా మూడు లక్షల మంది పౌరులను బందీలుగా ఉంచిందని ఉక్రెయిన్ ఆరోపించింది.
ఇంటర్నేషనల్ కమిటీ ఆఫ్ ది రెడ్ క్రాస్ మధ్యవర్తిత్వంతో ఒప్పందాలు ఉన్నప్పటికీ.. తరలింపు ప్రక్రియను రష్యా అడ్డుకుంటోందని తెలిపింది. ఈ క్రమంలోనే ఓచిన్నారి డైహైడ్రేషన్‌తో మృతి చెందినట్లు చెప్పింది. రష్యా దండయాత్ర.. ఉక్రెయిన్‌తో ముగియదన్నారు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ. ప్రపంచంలోని ఇతర దేశాలపైనా ప్రభావం చూపుతుందన్నారు.
రష్యా అధ్యక్షుడు పుతిన్‌ను మృగంతో పోల్చిన జెలెన్ స్కీ.. ఆయన ఎప్పటికీ సంతృప్తి చెందరన్నారు. తినేకొద్ది ఆ మృగం ఇంకా కావాలంటూ మిగిలిన దేశాలపైనా పడుతుందని హెచ్చరించారు. ఉక్రెయిన్‌పై యుద్ధం నేపథ్యంలో రష్యా మరోసారి ఐరోపా దేశాలను హెచ్చరించింది. రష్యా నుంచి చమురు దిగుమతులపై పశ్చిమ దేశాలు నిషేధం విధిస్తే జర్మనీకి వెళ్లే ప్రధాన గ్యాస్‌పైప్‌లైన్‌ను నిలిపేస్తామని బెదిరించింది.
అలాంటి చర్య ప్రపంచ చమురు సరఫరాలో విపత్కర పరిణామాలకు దారి తీస్తుందని వార్నింగ్ ఇచ్చింది. అటు ఉక్రెయిన్‌లోని 5 నగరాల్లో రష్యా మంగళవారం కాల్పుల విరమణ ప్రకటించింది. కీవ్, చెర్నిగోవ్, సుమీ, మేరియుపోల్, ఖర్కీవ్ నగరాల నుంచి పౌరుల తరలింపునకు హ్యుమానిటేరియన్ కారిడార్‌లను తెరిచింది. దీంతో సుమీలో చిక్కుకుపోయిన 694 మంది విద్యార్థులను భారత్ తరలించింది.
పౌరులందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని అక్కడి నుంచి బయటపడాలని సూచించింది. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా మరోసారి హ్యుమానిటేరియన్ కారిడార్‌లను ఎప్పుడు ఏర్పాటు చేస్తారనేది స్పష్టత లేదని తెలిపింది. ఇక ఉక్రెయిన్‌పై దాడికి దిగిన రష్యా బలగాలు.. ప్రస్తుతం పూర్తిగా ఆదేశ భూభాగంలోకి ప్రవేశించినట్లు అమెరికా వెల్లడించింది.
లక్షా 50వేలకు పైగా పుతిన్ సేనలు.. ఉక్రెయిన్ రాజధాని కీవ్ సమీపంలోకి చేరుకుంటున్నాయని తెలిపింది. మరోవైపు.. రష్యా యుద్ధం నేపథ్యంలో ఉక్రెయిన్ సరిహద్దుల్లోని నాటో సభ్య దేశాలకు మరికొన్ని తమ బలగాలను తరలిస్తున్నట్లు స్పష్టం చేసింది. రష్యా ఆర్మీ ఆపరేషన్ మొదలైనప్పటినుంచి లక్షలాది మంది ఉక్రెయిన్ నుంచి పొరుగు దేశాలకు వెళ్తున్నారు.
తాజాగా ఈ సంఖ్య 20 లక్షలు దాటిందని ఐకరాజ్యసమితి ప్రకటించింది. ఘర్షణకు తక్షణమే ముగింపు పలకకపోతే.. లక్షలాది ప్రజల జీవితాలు ఛిన్నాభిన్నమవుతాయని ఆందోళన వ్యక్తం చేసింది. ఇక ఉక్రెయిన్, రష్యా మధ్య త్వరలో మరో విడత చర్చలు జరగనున్నాయి. మార్చి 10న ఇరు దేశాల విదేశాంగ మంత్రులు టర్కీ వేదికగా భేటీ కాబోతున్నారు. ఇక ఈ చర్చలతోనానా యుద్ధానికి ముగింపు పడుతుందో లేదో చూడాలి.