China America Cyber War : అమెరికా మాపై సైబర్ అటాక్ చేస్తుంది : చైనా
China America Cyber War : అగ్రదేశం అమెరికా.. చైనాల మధ్య ఆరోపణలు కొనసాగుతున్నాయి
China America Cyber War: అగ్రదేశం అమెరికా.. చైనాల మధ్య ఆరోపణలు కొనసాగుతున్నాయి. ఎప్పుడు ఉప్పునిప్పులా ఉండే ఈ రెండు దేశాలు ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవడం కామనైంది. ఈ నేపథ్యంలో చైనా అమెరికాపై మరోసారి విరుచుకుపడింది. తమపై వేల సంఖ్యలో సైబర్ దాడులకు పాల్పడుతుందంటూ డ్రాగన్ దేశం అంటోంది. తమ దేశంలోని యూనివర్సిటీలనుంచి చాలా విలువైన సమాచారాన్ని అమెరికా దొంగిలించిందని అంటోంది. అమెరికా నేషనల్ సెక్యూరిటీ ఏజెన్సీ ఇందుకు కారణమని
గత కొన్నేళ్లుగా తమ నెట్‌వర్క్‌లే లక్ష్యంగా అమెరికా సైబర్ దాడులకు పాల్పడుతుందని చైనా చెబుతోంది. ఏరోనాటికల్, అంతరిక్ష రంగాల్లో పరిశోధనలు నిర్వహించే నార్త్ వెస్ట్రన్ పాలిటెక్నికల్ యూనివర్సిటీ నెట్‌వర్క్‌లోకి.. ఎన్‌ఎస్‌ఏ ఆఫీస్ ఆఫ్ టైలర్డ్ యాక్సెస్ ఆపరేషన్స్ లోకి చొరబడిందని తెలిపింది.
సర్వర్లు, రూటర్‌లు, నెట్‌వర్క్ స్విచ్‌లతో సహా పదివేల నెట్‌వర్క్ పరికరాలను తన నియంత్రణలోకి తీసుకుందని ఆవేదన వ్యక్తంచేసింది. పదుల సంఖ్యలో ఆపరేటింగ్ సిస్టమ్‌లో లోపాలను ఆసరాగా తీసుకుని.. పాస్‌వర్డ్‌లు, కీలక నెట్‌వర్క్ పరికరాలు, ప్రధాన సాంకేతిక సమాచారంపై యాక్సెస్ పొందినట్లు తెలిపింది. 140 గిగాబైట్లకు పైగా హైవ్యాల్యూ డేటాను దొంగిలించినట్లు చైనా తెలిపింది.
చైనా విదేశాంగ శాఖ హ్యాకింగ్‌లపై మండిపడింది. తమ జాతీయ భద్రత, వినియోగదారుల వ్యక్తిగత సమాచార భద్రతకు ఇది తీవ్ర విఘాతం కలిగిస్తుందన్నది. దీనిపై వివరణ ఇవ్వాలని, చట్టవిరుద్ధమైన కార్యకలాపాలను వెంటనే నిలిపేయాలని డిమాండ్ చేసింది. అమెరికా సైతం తమ వ్యాపారాలు, ప్రభుత్వ ఏజెన్సీలపై బీజింగ్ సైబర్ దాడులకు పాల్పడిందని గతంలో ఆరోపించింది. తాజాగా చైనా చేసిన ఆరోపణలతో ఇరు దేశాల మధ్య వాదనలు కొనసాగుతున్నాయి.