Ukraine Russia: ఉక్రెయిన్‌కు మద్దతుగా అమెరికా కూడా దిగితే.. ఎంతకాలం యుద్ధం జరగొచ్చు?
Ukraine Russia: యుద్ధం మొదలైంది. ఉక్రెయిన్‌లోకి చొచ్చుకువెళ్తున్న రష్యా బలగాలు మిసైళ్లతో విరుచుకుపడుతున్నాయి.;
Ukraine Russia: యుద్ధం మొదలైంది. ఉక్రెయిన్‌లోకి చొచ్చుకువెళ్తున్న రష్యా బలగాలు మిసైళ్లతో విరుచుకుపడుతున్నాయి. పౌరుల్ని, జనావాసాలను తాము టార్గెట్ చేయడం లేదని ఎయిర్‌బోస్‌లు, డిఫెన్స్ కేంద్రాలనే లక్ష్యంగా చేసుకున్నామని చెప్పుకొస్తోంది. డాన్‌బాస్ ప్రాంతం టార్గెట్‌గా సైనిక చర్య మరింత వేగవంతం చేస్తూ దాడులు కొనసాగిస్తామని పుతిన్ ప్రకటించారు.
అటు.. ఈ విషయంలో ఎవరు జోక్యం చేసుకున్నా తమవైపు నుంచి కూడా పరిణామాలు తీవ్రంగానే ఉంటాయని హెచ్చరించారు. మరోవైపు, ఈ దాడుల్ని ఎదుర్కొంటామని, రష్యా ఆధిపత్య వైఖరికి తలొగ్గేది లేదని ఉగ్రెయిన్ అధ్యక్షుడు వొలోదిమెర్ జలెన్‌స్కీ ప్రకటించారు. తమ దేశాన్ని కాపాడుకుంటామని విశ్వాసం వ్యక్తం చేశారు. తమ గగనతలంలోకి చొరబడ్డ 5 యుద్ధ విమానాలు, ఒక హెలికాఫ్టర్లను కూల్చేసినట్టు ఉక్రెయిన్ సైన్యం ప్రకటించింది.
లుహాన్స్క్ ప్రాంతంలో రష్యాకు దీటైన బదులిచ్చామని పేర్కొంది. యుద్ధం విషయంలో రష్యా ఏకపక్ష వైఖరిపై EU మండిపడుతోంది. అన్యాయమైన, అరాచకమైన దాడి పర్యవసానాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరిస్తోంది. ఫ్రాన్స్ ఉక్రెయిన్‌కే మద్దతు ప్రకటించింది. ఆర్థిక, రక్షణ పరంగా అండగా ఉంటామని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమ్మానుయేల్ మేక్రాన్ చెప్పారు.
UK ప్రధాని బోరిన్ జాన్సన్ ఉక్రెయిన్ అధ్యక్షుడు జలెన్‌స్కీతో తదుపరి కార్యాచరణపై మాట్లాడారు. రక్తపుటేరులు పారించేలా పుతిన్ సృష్టించిన విధ్వంసాన్ని ఖండించారు. ఈ పరిణామాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని.. UKతోపాటు మిత్రపక్షాలన్నీ నిర్ణయాత్మకంగా వ్యవహరిస్తాయన్నారు. ఈయూ దేశాలతోపాటు, జపాన్, కెనడా, బ్రిటన్ సహా మరికొన్ని దేశాలు రష్యాపై ఆంక్షలు విధించాయి.
అంతర్జాతీయ చట్టాలను ఉల్లంఘించడాన్ని తీవ్రంగా పరిగణిస్తాంటున్నాయి. అటు, ఐక్యరాజ్యసమితి ఈ పరిణామాలపై ఆందోళన వ్యక్తం చేసింది. రష్యా అధ్యక్షుడు పుతిన్ మానవత్వంతో వ్యవహరించాలని, బలగాలను వెనక్కి తీసుకోవాలని కోరింది. అటు, ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో భారతీయులందరినీ వెనక్కి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.
ఐతే.. ప్రస్తుతం ఉక్రెయిన్ గగనతలాన్ని మూసేసిన నేపథ్యంలో.. అక్కడ చిక్కుకుపోయన వారి భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది. ఇవాళ ఉదయం ప్రత్యేక విమానంలో 182 మంది ఢిల్లీ చేరుకున్నారు. మిగతావారిని తీసుకువచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నా.. యుద్ధం నేపథ్యంలో ఎయిరిండియా ఫ్లైట్లు తిరిగి వెనక్కి వచ్చేశాయి.