Crude Oil : ముంచుకొస్తున్న ధరల సునామీ.. 150 డాలర్లకు ముడి చమురు? బ్రోకరేజ్ సంస్థల వార్నింగ్.

Update: 2026-03-05 08:45 GMT

Crude Oil : అమెరికా, ఇరాన్ మధ్య ముదురుతున్న యుద్ధ మేఘాలు అంతర్జాతీయ చమురు మార్కెట్‌ను కుదిపేస్తున్నాయి. ఇరాన్ తన వద్ద ఉన్న బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించేందుకు సిద్ధమైంది. ప్రపంచవ్యాప్త ముడి చమురు సరఫరాలో దాదాపు 20 శాతం వాటా కలిగిన కీలకమైన స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ జలసంధిని మూసివేస్తామని ఇరాన్ హెచ్చరించింది. ఇదే కనుక జరిగితే, ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్, ఎల్‌ఎన్‌జీ సరఫరాకు బ్రేక్ పడి, ధరలు ఆకాశాన్ని తాకడం ఖాయమని విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఈ ఉద్రిక్తతల నేపథ్యంలో అంతర్జాతీయ బ్రోకరేజ్ సంస్థలు భయంకరమైన అంచనాలను వెలువరిస్తున్నాయి. డిబిఎస్ బ్యాంక్ హెచ్చరిక ప్రకారం, హోర్ముజ్ మార్గం పూర్తిగా మూతపడితే బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 100 నుంచి 150 డాలర్లకు చేరవచ్చు. ఇప్పటికే చమురు ధరలు 13 శాతం పెరిగి 82 డాలర్ల మార్కును దాటేశాయి. ఇది జనవరి 2025 తర్వాత నమోదైన అత్యధిక ధర. గోల్డ్‌మన్ సాక్స్, జేపీ మోర్గాన్ వంటి దిగ్గజ సంస్థలు కూడా సరఫరాలో అంతరాయం ఏర్పడితే చమురు సెగ సామాన్యుడికి తప్పదని స్పష్టం చేస్తున్నాయి.

ముఖ్యంగా భారత్ వంటి అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఇది కోలుకోలేని దెబ్బ. మన దేశం దిగుమతి చేసుకునే ముడి చమురులో దాదాపు 50 శాతం ఈ హోర్ముజ్ మార్గం గుండానే వస్తుంది. ప్రతిరోజూ సుమారు 26 లక్షల బ్యారెళ్ల చమురు ఈ మార్గం ద్వారానే భారత తీరాలకు చేరుతుంది. చమురు ధరల్లో కేవలం 10 శాతం పెరుగుదల ఉన్నా, అది దేశ ద్రవ్యోల్బణంపై మరియు కరెంట్ అకౌంట్ డెఫిసిట్ పై తీవ్ర ప్రభావం చూపుతుంది. అంటే పెట్రోల్ రేట్లు పెరగడమే కాకుండా, రవాణా ఛార్జీలు పెరిగి నిత్యావసర వస్తువుల ధరలు కూడా మండిపోతాయి.

ప్రస్తుత సంక్షోభాన్ని ఎదుర్కోవడానికి అమెరికా తన దగ్గర ఉన్న వ్యూహాత్మక చమురు నిల్వలను వాడే అవకాశం ఉన్నప్పటికీ, అది కేవలం తాత్కాలిక ఉపశమనం మాత్రమేనని నిపుణులు చెబుతున్నారు. యుద్ధం సుదీర్ఘంగా కొనసాగితే ఈ నిల్వలు ఏమాత్రం సరిపోవు. ఇరాన్-అమెరికా మధ్య ఉద్రిక్తతలు తగ్గి, పరిస్థితులు చక్కబడే వరకు చమురు మార్కెట్‌లో ఈ అనిశ్చితి, ధరల పెరుగుదల కొనసాగుతూనే ఉంటుంది. భారత్ వంటి దేశాలు ఇప్పుడు ప్రత్యామ్నాయ మార్గాల కోసం లేదా దౌత్యపరమైన పరిష్కారాల కోసం ఎదురుచూడాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Tags:    

Similar News