Ukraine Russia: భారతీయ విద్యార్థుల తరలింపులో కొత్త వివాదం.. బందీగా ఉన్నారంటూ..

Ukraine Russia: ఉక్రెయిన్‌ నుంచి భారతీయ విద్యార్థుల తరలింపులో కొత్త వివాదం నెలకొంది.

Update: 2022-03-03 04:26 GMT

Ukraine Russia: ఉక్రెయిన్‌ నుంచి భారతీయ విద్యార్థుల తరలింపులో కొత్త వివాదం నెలకొంది. రష్యా దాడులతో ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన పౌరులను తరలించడానికి భారత్‌ ప్రయత్నాలు వేగవంతం చేసింది. రష్యా, ఉక్రెయిన్ దేశాలు సురక్షితంగా తరలించేందుకు సహకరించాలని కేంద్రం కోరింది. అయితే.. భారతీయ విద్యార్థులను బందీలుగా ఉంచుకున్నాయని పరస్పరం ఆరోపణలు చేసుకున్నాయి రష్యా, ఉక్రెయిన్.

ఖార్కివ్ నుండి భారతీయ విద్యార్థులను తరలించడానికి రష్యా ప్రయత్నిస్తుండగా ఉక్రెయిన్ బలగాలు బందీలుగా పట్టుకున్నాయని రష్యా రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఖార్కివ్‌ భూభాగాన్ని విడిచిపెట్టి బెల్గోరోడ్‌కు వెళ్లాలనుకునే భారతీయ విద్యార్థుల సమూహాన్ని బలవంతంగా నిర్బంధిస్తున్నారని సంచలన ఆరోపణలు చేశారు రష్యా రక్షణశాఖ అధికారిక ప్రతినిధి, మేజర్ జనరల్ ఇగోర్ కోనాషెంకోవ్.

భారత పౌరులను సురక్షితంగా తరలించడానికి అవసరమైన అన్ని చర్యలను తీసుకోవడానికి రష్యా సాయుధ దళాలు సిద్ధంగా ఉన్నాయని ప్రకటించారు. భారత్‌ ప్రతిపాదించినట్లుగా వారి సైనిక రవాణా విమానాలు, భారతీయ విమానాలతో రష్యా భూభాగం నుండి విధ్యార్థులను ఇంటికి పంపిస్తామని తెలిపారు. రష్యా అధ్యక్షుడు పుతిన్‌తో.. ప్రధాని నరేంద్ర మోదీ ఫోన్ చేసిన కొన్ని గంటల తర్వాత రష్యా మంత్రిత్వ శాఖ ఈ ప్రకటన చేసింది.

భారత్‌, పాకిస్తాన్, చైనాతో పాటు పలు దేశాల విద్యార్థులు రష్యన్ సాయుధ దురాక్రమణకు బందీలుగా మారారని ఉక్రెయిన్ విదేశాంగ శాఖ ఆరోపించింది. ఖార్కివ్, సుమీలలో రష్యన్ సాయుధ దురాక్రమణలో బందీలుగా మారిన భారత్‌, పాకిస్తాన్, చైనా విద్యార్థుల సమాచారాన్ని ప్రభుత్వాలకు ఇచ్చామని ఉక్రెయిన్ విదేశాంగ శాఖ తెలిపింది.

ఉక్రెయిన్‌ నగరాల నుండి విధ్యార్థులు సురక్షితంగా వెళ్లేందుకు రష్యాను ఆయా దేశాలు డిమాండ్ చేయాలని కోరుతున్నామని తెలిపింది ఉక్రెయిన్. ఉక్రెయిన్, రష్యాల ప్రకటనలను ఖండించింది భారత విదేశాంగశాఖ. భారతీయ విద్యార్థులు ఎవరూ బందీలుగా లేరని వెల్లడించింది. విద్యార్థులతో నిరంతరం టచ్‌లో ఉన్నామని.. ఈ వార్తలు నమ్మవద్దని తల్లిదండ్రులకు సూచించింది.

ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన 20వేల మంది భారతీయులలో 6వేల మందిని ఇప్పటివరకు దేశానికి తీసుకువచ్చామని, మిగిలిన వారిని సురక్షితంగా తిరిగి తీసుకురావడానికి అన్ని ప్రయత్నాలు చేస్తున్నామన్నారు కేంద్ర విదేశాంగ శాఖ సహాయ మంత్రి మురళీధరన్.  

Tags:    

Similar News