H-1B Visa Fee: అమెరికాలోని భారత విద్యార్థులకు భారీ ఊరట.. ఫీజు ఎవరికంటే

ఎఫ్‌-1, జే-1, ఎల్-1 వీసాదారులకు భారీ ఊరట

Update: 2025-10-22 04:00 GMT

అమెరికాలో ఉన్నత విద్య, ఉద్యోగాల కోసం ప్రయత్నిస్తున్న లక్షలాది మంది భారతీయులకు అక్కడి ప్రభుత్వం భారీ ఊరట కల్పించింది. హెచ్-1బీ వీసా కోసం ప్రతిపాదించిన లక్ష డాలర్ల (సుమారు రూ. 8.3 కోట్లు) భారీ ఫీజు విషయంలో కీలక స్పష్టతనిచ్చింది. ఇప్పటికే అమెరికాలో ఎఫ్‌-1 (విద్యార్థి), జే-1 (పరిశోధకులు), ఎల్-1 (అంతర్గత బదిలీ) వంటి వీసాలపై ఉన్నవారు హెచ్-1బీకి మారేటప్పుడు ఈ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదని అమెరికా పౌరసత్వ, వలస సేవల విభాగం (యూఎస్‌సీఐఎస్‌) అధికారికంగా ప్రకటించింది.

యూఎస్‌సీఐఎస్‌ విడుదల చేసిన తాజా మార్గదర్శకాల ప్రకారం, ఈ ఫీజు నిబంధన అమెరికా వెలుపల నుంచి కొత్తగా హెచ్-1బీ వీసా కోసం దరఖాస్తు చేసుకునేవారికి మాత్రమే వర్తిస్తుంది. ఇప్పటికే అమెరికాలో చదువు పూర్తి చేసుకుని ఆప్షనల్ ప్రాక్టికల్ ట్రైనింగ్ (ఓపీటీ)లో ఉన్న విద్యార్థులకు ఈ నిబంధన నుంచి మినహాయింపు లభించనుంది. అలాగే, ప్రస్తుతం హెచ్-1బీపై పనిచేస్తూ వీసాను పునరుద్ధరించుకునేవారికి లేదా వేరే కంపెనీకి మారేవారికి కూడా ఈ ఫీజు వర్తించదని స్పష్టం చేసింది.

అయితే, ఈ మినహాయింపులకు కొన్ని షరతులు వర్తిస్తాయని యూఎస్‌సీఐఎస్‌ తెలిపింది. ఎవరైనా విద్యార్థి వీసాపై ఉన్నప్పుడు నిబంధనలకు విరుద్ధంగా అనధికారిక పనులు చేసినట్లు తేలితే, వారికి ఈ మినహాయింపు లభించదు. అలాంటి వారి వీసా మార్పు దరఖాస్తు తిరస్కరణకు గురైతే, వారు లక్ష డాలర్ల ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. 2025 సెప్టెంబర్ 21వ తేదీకి ముందు హెచ్-1బీ కోసం దరఖాస్తు చేసుకుని ఆమోదం పొందిన వారికి కూడా పాత నిబంధనలే వర్తిస్తాయని పేర్కొంది.

ప్రస్తుతం అమెరికాలో 3.3 లక్షల మంది భారతీయ విద్యార్థులు చదువుతుండగా, వారిలో సుమారు లక్ష మంది ఓపీటీలో ఉన్నారు. ఈ తాజా నిర్ణయంతో స్టెమ్ కోర్సులు చదివి, మూడేళ్ల వరకు అమెరికాలో పనిచేసే అవకాశం ఉన్న విద్యార్థులకు ఎంతో ప్రయోజనం చేకూరనుంది. యాజమాన్యాలు కూడా వీరికి హెచ్-1బీ స్పాన్సర్ చేయడానికి ముందుకు వస్తాయి. దరఖాస్తు సమయంలో ఫీజు మినహాయింపున‌కు సంబంధించిన ఆధారాలను జత చేయకపోతే అప్లికేషన్ తిరస్కరణకు గురవుతుందని యూఎస్‌సీఐఎస్‌ హెచ్చరించింది.

Tags:    

Similar News